భారత్ కెనడాల మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారాయి. దౌత్యవేత్తలను తగ్గించాలని ఆదేశించడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని కెనడా చేసిన ప్రకటనపై భారత విదేశాంగ శాఖ ఘాటుగా స్పందించింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే దౌత్యవేత్తలను తగ్గించుకోవాలని కెనడాకు సూచించినట్లు భారత్ తెలిపింది.
భారత్లో 41 మంది దౌత్యవేత్తలను వెంటనే వెనక్కు పిలిపించుకోవాలని, వారికి దౌత్యపరమైన రక్షణ తొలగిస్తామని హెచ్చరికల నేపథ్యంలో కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ చేసిన ప్రకటన వివాదానికి దారితీసింది. భారత్ నిర్ణయం అసంజసంగా ఉందంటూ జోలీ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది.
భారత్లో కెనడా దౌత్యవేత్తల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.వారు తరచూ భారత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు. ఇరు దేశాల దౌత్య సిబ్బంది మధ్య సమానత్వం ఉండాలని కోరుకుంటున్నామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. దౌత్య సిబ్బందిలో సమానత్వం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించారంటూ కెనడా చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.