చైనాలోని హాంగ్జౌలో ఇటీవల ముగిసిన ఆసియా
క్రీడల్లో పతకాలు గెలిచిన ఆంధ్ర క్రీడాకారులను రాష్ట్రప్రభుత్వం సన్మానించింది. స్వర్ణ
పతక విజేతలకు 30లక్షలు, రజత పతక విజేతలకు 20 లక్షల చొప్పున నగదు పురస్కారాలు
అందించింది.
ఆసియా క్రీడల్లో విజయాలు సాధించిన రాష్ట్రానికి
చెందిన క్రీడాకారులు కోనేరు హంపి, బి అనూష, యర్రాజీ జ్యోతి ఇవాళ ముఖ్యమంత్రి
జగన్మోహనరెడ్డిని క్యాంప్ కార్యాలయంలో కలిసి పతకాలు చూపించారు. అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి
ఖ్యాతిని నిలబెడుతున్నారంటూ వారిని సీం అభినందించారు. ఈ సందర్భంగా, క్రీడాకారులకు
రాష్ట్ర క్రీడావిధానం ప్రకారం ఇచ్చే నగదు పురస్కారాలను ప్రభుత్వం విడుదల చేసింది.
ఆసియా
క్రీడల్లో ఆర్చరీలో మూడు స్వర్ణాలు సాధించిన విజయవాడ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖకు
రూ. 90 లక్షలు నగదు బహుమతి విడుదల చేసారు. బ్యాడ్మింటన్‌లో ఒక స్వర్ణ పతకం, ఒక రజత
పతకం గెలిచిన రాజమహేంద్రవరానికి చెందిన ఆర్ సాత్విక్ సాయిరాజ్‌కు రూ. 50 లక్షలు
నగదు బహుమతి ఇచ్చారు. క్రికెట్లో స్వర్ణపతకం సాధించిన భారత జట్టు
సభ్యురాలు, అనంతపురానికి చెందిన బి అనూషకు రూ. 30 లక్షలు నగదు బహుమతి విడుదల చేసారు.
అథ్లెటిక్స్‌లో
రజత పతకం సాధించిన విశాఖపట్నానికి చెందిన యర్రాజీ జ్యోతికి, ఆర్చరీలో రజత పతకం సాధించిన బొమ్మదేవర
ధీరజ్‌కు, బ్యాడ్మింటన్‌లో
రజత పతకం గెలిచిన గుంటూరుకు చెందిన కిడాంబి శ్రీకాంత్‌కు, చదరంగంలో రజత పతకం గెలిచిన కోనేరు హంపికి, టెన్నిస్‌లో
రజతపతకం గెలిచిన విశాఖపట్నం క్రీడాకారుడు మైనేని సాకేత్ సాయికి చెరో 20 లక్షల నగదు
బహుమతి విడుదల చేసారు.
ఈ
నగదు పురస్కారంతో పాటు గతంలో పతకాలు సాధించినందుకు ఇచ్చే ప్రోత్సాహక బకాయిలు
మొత్తం కలిపి ప్రభుత్వం రూ. 4.29 కోట్లు విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్ ఎండీ హెచ్.ఎం.ధ్యానచంద్ర, శాప్ అధికారి రామకృష్ణ తదితరులు
పాల్గొన్నారు.