దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారీ హత్యల కేసులో దోషులు సురీందర్ కోలీ, మోనీందర్ సింగ్ పంధేర్లు జైలు నుంచి విడుదలయ్యారు. 2006లో నిఠారీ హత్యల వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జిల్లా కోర్టు వీరికి జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి వీరు నొయిడా జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. తాజాగా అలహాబాద్ హైకోర్టు వీరిని నిర్దోషులుగా ప్రకటించింది. నిఠారీ హత్యల కేసులో సాక్ష్యాలు లేకపోవడంతో అలవాబాద్ హైకోర్టు సురీందర్ కోలీ, మోనీందర్ సింగ్ పంధేర్లను రెండు రోజుల కిందట నిర్దోషులుగా ప్రకటించింది.
2005 నుంచి 2006 మధ్య ఉత్తరప్రదేశ్లోని నొయిడా నిఠారీ ప్రాంతంలోని మోనీందర్ పంధేర్ ఇంటిలో వరుస హత్యలు చోటు చేసుకున్నాయి. సురీందర్ కోలీ ఆ సమయంలో పంధేర్ ఇంటిలో పనివాడిగా చేశాడు. పిల్లలను ఇంటికి రప్పించి కోలీ, పంధేర్ వారిపై అత్యాచారం చేసి, హత్య చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
సాక్ష్యాలు లేకుండా చేసేందుకు పిల్లలను చంపి సమీపంలోకి కాలువలో పడేశారని పోలీసుల కేసు వివరాల్లో నమోదైంది. సమీపంలోని కాలువలో పిల్లల శరీర భాగాలు లభించడంతో వీరిపై కేసు నమోదైంది. తరవాత ఈ కేసును సీబీఐకి అప్పగించారు. పిల్లలపై అత్యాచారం చేయడం, వారిని హత్య చేయడంతోపాటు, నరమాంస భక్షణ చేశారని 2006లో దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం అయింది. ఈ కేసులో సాక్ష్యాలు లభించకపోవడంతో ఇద్దరు దోషులను అలహాబాద్ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో వారు ఇవాళ జైలు నుంచి విడుదలయ్యారు.