రాజస్థాన్
శాసనసభలోని 200 స్థానాల కోసం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య పోరు హోరాహోరీగా
జరగనుంది. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల మీద, అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ కార్యక్రమాల
మీద ఆధారపడుతోంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ వ్యతిరేకత, నరేంద్ర మోదీ వ్యక్తిగత
ఇమేజ్ మీద ఆధారపడుతోంది. రెండు పార్టీల్లోనూ అంతర్గత విభేదాలు తారస్థాయిలో
ఉన్నాయి. ప్రత్యర్థి బలహీనతలను తమకు అనుకూలంగా మలచుకోడానికి ఉభయ పక్షాలూ
ప్రయత్నిస్తున్నాయి. ఆ ప్రయత్నాల్లో విజయం ఎవరిని వరిస్తుంది?
ప్రతీ
ఐదేళ్ళకూ పాలక పక్షాన్ని మార్చివేయడం రాజస్థాన్ రాజకీయంలో పరిపాటి. 1993 అసెంబ్లీ
మధ్యంతర ఎన్నికల నుంచి ఏ అధికార పక్షమూ రెండోసారి ఎన్నిక కాలేదు. ఆ ఆనవాయితీ కొనసాగితే,
ఐదేళ్ళ కాంగ్రెస్ పరిపాలన తర్వాత ఈసారి బీజేపీ లబ్ధి పొందాలి.
భారతీయ
జనతా పార్టీ కూడా కాంగ్రెస్‌లోని అంతర్గత విభేదాల నుంచి ఎలా లబ్ధి పొందాలని
ఆలోచిస్తోంది. మరీ ప్రధానంగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్‌లో అసంతృప్తగళం
వినిపిస్తున్న కీలక నేత సచిన్ పైలట్ మధ్య విభేదాలు బహిర్గతమే. ఆ గొడవలను తనకు
అనుకూలంగా మలచుకుని ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ భావిస్తోంది.
‘‘అశోక్
గెహ్లాట్ ఈ ఎన్నికను తన ప్రతిష్టకు సంబంధించిన అంశంగా భావిస్తున్నాడు. అందువల్లే
ఎన్నికల ప్రచారంలో సచిన్ పైలట్ కానీ, కాంగ్రెస్ అధిష్టానం కానీ ఎక్కడా కనిపించడం
లేదు. ఇంక కాంగ్రెస్ అనుసరిస్తున్న మైనారిటీ సంతుష్టీకరణ విధానాలు జాతీయ
ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నాయని సామాన్య ఓటరు స్పష్టంగా అర్ధం చేసుకున్నాడు.
అందువల్ల, మా పార్టీ కచ్చితంగా 160కి పైగా స్థానాల్లో గెలిచి తీరుతుంది’’ అని
బీజేపీ మాజీ ఎమ్మెల్యే షైతాన్ సింగ్ చెప్పుకొచ్చారు.
రాజస్థాన్‌లో
శాంతిభద్రతలు క్షీణించిపోయిన సందర్భాలెన్నో. ప్రత్యేకించి గత ఐదేళ్ళలో మహిళలపై నేరాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. అవినీతికి
అంతే లేకుండా పోయింది. స్వయంగా గెహ్లాట్ క్యాబినెట్‌లోని మంత్రే ‘రెడ్ డైరీ’ కేసు
అంటూ అవినీతి గురించి మాట్లాడిన పరిస్థితి. ఆ మంత్రిని గెహ్లాట్ వెంటనే డిస్మిస్
చేసాడు. భారతీయ జనతా పార్టీ వీటన్నింటినీ తన ఎన్నికల ప్రచారంలో బలంగా
ప్రస్తావిస్తోంది. స
అయితే
ప్రతిపక్షానికి ఆందోళన కలిగిస్తున్న విషయం ఒకటుంది. అవినీతి, శాంతిభద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా
ప్రభుత్వ వ్యతిరేకత మాత్రం పెద్దగా లేదని విశ్వసనీయ సమాచారం. మరోవైపు, కాంగ్రెస్
ప్రకటించిన జనాకర్షక పథకాలకు ప్రజలు ఎంతమేర తలొగ్గుతారన్నది భారతీయ జనతా పార్టీ
ముందున్న పెద్ద సవాల్. వంద యూనిట్ల వరకూ ఉచిత కరెంటు, రూ.500కే గ్యాస్ సిలెండర్,
వృద్ధాప్య పింఛను పెంపుదల వంటి పథకాలతో కాంగ్రెస్ ఓటర్లను ఆకట్టుకుంటోంది. ఈ ఉచిత
హామీలపట్ల ప్రజల్లో స్పందన బాగానే ఉన్నట్టు తెలుస్తోంది.
‘‘2014లోలా
ఈసారి రాజస్థాన్‌లో మోదీ వేవ్ లేదు. మా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు
ప్రజలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూర్చాయి. గెహ్లాట్ ప్రభుత్వం చేసిన కృషి వల్ల ప్రజల
జీవితాలు మెరుగుపడ్డాయి. ఆ విషయాన్ని ప్రజలు కూడా అర్ధం చేసుకున్నారు. అందుకే
మాలాంటి ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటనలకు వెడుతుంటే ప్రజల నుంచి అద్భుతమైన
స్పందన వస్తోంది’’ అని రాజస్థాన్ మైనారిటీ వ్యవహారాల మంత్రి సలే మహమ్మద్ అన్నారు.
‘‘నానాటికీ
పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంతో మహిళలు విసిగిపోయారు. ఉద్యోగాలు రాని యువతరం కలలు
కల్లలైపోయాయి. అవి రెండూ కేంద్రంలోని మోదీ సర్కారు వైఫల్యాలు. ఆ విషయం ప్రజలకు
బాగా అర్ధమైంది. అందుకే, మళ్ళీ మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమాగా ఉన్నాం’’
అన్నారు సలే మహమ్మద్.
అయితే,
కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కూడా నిరాశ తీవ్రంగానే ఉంది. ఇటీవల ఆ పార్టీ ఎన్నో రకాల సర్వేలు
నిర్వహించింది. అందులో ఎమ్మెల్యేలు, ఇతర నేతల ప్రజాదరణ ఎలా ఉందన్నది ఒక సర్వే.
దాని ఆధారంగా, గెలిచే గుర్రాలనే ఎంపిక చేయడంపైనే కాంగ్రెస్ విజయావకాశాలు ఆధారపడి
ఉన్నాయి. కొన్నిసీట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై పార్టీ కార్యకర్తల్లోనే వ్యతిరేకత
తీవ్రంగా ఉంది. వారు బహిరంగంగానే ఆందోళనలు చేస్తున్నారు. అలాంటి చోట్ల టికెట్ల
పంపిణీలో కాంగ్రెస్ జాగ్రత్తలు తీసుకోవలసి ఉంది.
అశోక్
గెహ్లాట్‌కూ, ఒకప్పటి అతని సహచరుడు సచిన్ పైలట్‌కూ మధ్య బహిరంగంగానే జరిగిన రాజకీయ
ఘర్షణలు ప్రజలు అంత త్వరగా మరచిపోయేవి కావు. వాళ్ళ మధ్య ప్రస్తుతానికి శాంతి ఒప్పందం
జరిగి ఉండొచ్చు గాక, కానీ అది అంత బలమైనదేమీ కాదు. పదేపదే తలెత్తే తిరుగుబాట్లను
సర్దుబాటు చేయడంలో వృధా అయిపోయిన సమయం, వనరుల గురించి ప్రజలింకా మరచిపోలేదు.
తూర్పు
రాజస్థాన్‌లోని 24 నియోజకవర్గాలు గుజ్జర్, మీణాల స్థావరాలు. మొత్తం ఓటర్లలో వారు
5శాతం ఉన్నారు. 2018 ఎన్నికల్లో వారు ఏకపక్షంగా కాంగ్రెస్‌కు ఓటు వేసారు. అప్పటి
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సచిన్ పైలట్ ముఖ్యమంత్రి అవుతాడని వారు చాలా
ఆశించారు. ఇంతా చేసి గుజ్జర్ కులానికి చెందిన సచిన్ పైలట్‌కు సీఎం పీఠం దక్కనే లేదు. అంతేకాదు, గత ఐదేళ్ళలో పార్టీలో అతని
స్థాయి ఎలా పడిపోయిందో చూసాక గుజ్జర్ల ఓట్లన్నీ ఈసారి భారతీయ జనతా పార్టీకి
మళ్ళిపోయే అవకాశాలు ప్రబలంగా కనిపిస్తున్నాయి.
తూర్పు
రాజస్థాన్‌లోని 13 జిల్లాలకు తాగునీటి సౌకర్యం కల్పించే ఈస్టర్న్ రాజస్థాన్ కెనాల్
ప్రాజెక్టును కాంగ్రెస్, ఎన్నికల వివాదంగా మార్చాలని ప్రయత్నిస్తోంది. రాష్ట్ర
కేంద్ర ప్రభుత్వాల మధ్య విభేదాల కారణంగా ఆ ప్రాజెక్టు నత్తనడక నడుస్తోంది.
మరోవైపు,
రాజస్థాన్‌లో ప్రబలంగా ఉన్న ఓబీసీ వర్గమైన జాట్ కులం అశోక్ గెహ్లాట్ పట్ల పూర్తి
అసంతృప్తితో ఉన్నారు. నగౌర్ ఎంపీ హనుమాన్ బేణీవాల్ నేతృత్వంలోని రాష్ట్రీయ
లోకతాంత్రిక్ పార్టీ, జాట్ల ఆధిక్యం ఉన్న
నియోజకవర్గాల్లో తమ అభ్యర్ధులను నిలపడానికి ప్రయత్నిస్తోంది. ఈ బేణీవాల్ ‘ఫ్యాక్టర్’
బీజేపీ కంటె కాంగ్రెస్‌కే ఎక్కువ నష్టం కలిగిస్తుందని కొన్ని అధ్యయనాలు
చెబుతున్నాయి. అదే జరిగితే, 2018లో గెలుచుకున్న స్ధానాల్లో సైతం కాంగ్రెస్‌కు
ముప్పు పొంచి ఉన్నట్లే.
రాజస్థాన్‌లో
గతంలో భారతీయ ట్రైబల్ పార్టీగా ఉన్న పక్షం ఇప్పుడు భారతీయ ఆదివాసీ పార్టీగా రూపు
మార్చుకుంది. దక్షిణ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆ పార్టీ స్థానిక
ఎన్నికల్లో గెలవడమే కాదు, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 2 సీట్లు కూడా కైవసం
చేసుకుంది. ఆ ఎన్నికల్లో మాయావతికి చెందిన బహుజన సమాజ్ పార్టీ 5శాతం ఓట్లు
సాధించింది. అలాంటి పార్టీలు ఓట్లు చీల్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
అటు
బీజేపీలోనూ అంతర్గత ఘర్షణలు ఎక్కువగానే ఉన్నాయి. ఆ పార్టీ ఇప్పటివరకూ ముఖ్యమంత్రి
అభ్యర్ధిని ప్రకటించలేకపోయింది. నరేంద్ర మోదీని, పార్టీ గుర్తునూ నమ్మి ఓటు
వేయాలనీ, తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రిని ఎన్నుకుంటామనీ భాజపా నాయకత్వం సూచిస్తోందనుకోవాలి.
సీనియర్ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే తానింకా రంగంలోనే ఉన్నానని చెప్పుకోవచ్చు
గాక, కానీ పార్టీ జాతీయ నాయకత్వం ఆమెపట్ల ఉదాసీనంగానే ఉంది. అంతేకాదు, ఆమె
అనుచరుల్లో చాలామందికి టికెట్లు ఇవ్వడానికి కూడా నిరాకరించింది. దాంతో వసుంధర వర్గీయులందరూ
పార్టీ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే ఏడుగురు
ఎంపీలను అసెంబ్లీ బరిలో దించాల్సి వస్తోంది. అంత చేసినా కమలానికి రాష్ట్రంలో బలమైన
నాయకత్వం లేకపోవడం సమస్యాత్మకంగానే ఉంది.
భారతీయ
జనతా పార్టీ ప్రధానంగా నరేంద్ర మోదీ మీదనే ఆధారపడి ఉంది. హిందూ ఓట్లను
ఆకర్షించడానికి ఆ పార్టీకి వేరే మార్గమే లేదు. పార్టీలో అగ్రస్థానం కోసం దాదాపు
అరడజను మంది పోటీ పడుతున్నారు. కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, శాసనసభలో
విపక్ష నేత రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు సతీష్
పూనియా, ఆల్వార్ ఎంపీ మహంత్ బాలక్‌నాథ్ తదితరులు రేసులో ఉన్నా, వారిలో ఎవరినీ
నేతగా చూపడానికి భాజపా అధిష్టానానికి విశ్వాసం సరిపోవడం లేదు. దాంతో అశోక్ గెహ్లాట్‌కు
ప్రత్యర్థి లేని పరిస్థితి నెలకొంది.
ఎదుర్కోడానికి సరైన ప్రత్యర్థి లేని నేపథ్యంలో అశోక్
గెహ్లాటే బలమైన, అత్యున్నతమైన నాయకుడిగా కనిపిస్తున్నారు. ఇది రాబోయే లోక్‌సభ
ఎన్నికల్లో మోదీకి ఎదురు వచ్చే నాయకుడెవరూ లేని పరిస్థితిని పోలి ఉంది.