తెలంగాణ
అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం
కీలక నిర్ణయం తీసుకుంది. 100 కంపెనీల నుంచి 20 వేల కేంద్ర బలగాలు తెలంగాణకు పంపాలని
కేంద్రహోంశాఖను కోరింది. ఈసీ వినతి మేరకు తెలంగాణకు రానున్న రెండురోజుల్లో
కేంద్రబలగాలు చేరుకోనున్నాయి.
ఒక్కో కంపెనీలో అసోం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్,
సీఆర్పీఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, సశస్త్ర
సీమాబల్ వంటి బలగాలకు చెందిన 60 నుంచి 80 మంది వరకు సిబ్బంది ఉంటారు.
స్థానిక
పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఈ బలగాలు బందోబస్తులో పాల్గొంటాయి.
సరిహద్దులు, కీలక
ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసుకుని తనిఖీలు నిర్వహిస్తాయి. సమస్యాత్మక
ప్రాంతాల్లో కవాతు చేపడతాయి. ఈవీఎంలు భద్రపరిచే కేంద్రాలు వీరి అధీనంలోనే ఉంటాయి.
వాటిని భద్రపరిచిన కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్ళడం, పోలింగ్ అనంతరం
తిరిగి స్ట్రాంగ్‌రూమ్ కేంద్రాలకు తరలించే ప్రక్రియ ఈ బలగాల ఆధ్వర్యంలోనే
జరుగుతుంది.
బందోబస్తు
తో పాటు డబ్బు, మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు చేపట్టే తనిఖీల్లోనూ ఈ బలగాలు
నిమగ్నం కానున్నాయి.
ఎన్నికల కోడ్
అమలులోకి వచ్చిన్నప్పటి నుంచి పోలీసు తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోది. 2018 ఎన్నికల్లో రూ. 103 కోట్ల నగదు పట్టుబడింది. ఈసారి ఇంకా
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకుండానే, ఎన్నికల
కోడ్ అమలులోకి వచ్చిన
తొలి 11 రోజుల్లో
రూ. 243 కోట్లు
పట్టుబడింది.
గురువారం
ఉదయం నాటికే పోలీసులు పలు జిల్లాల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు రూ.243 కోట్లు.
సరిహద్దుల్లో
148 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. సరైన
వివరాలు లేని నగదు, ఆభరణాలతో
పాటు అక్రమంగా సరఫరా చేస్తున్న మద్యం, కానుకలు, గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు.