ప్రధాని కార్యాలయంపై తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని కార్యాలయం బెంగాల్ పారిశ్రామిక వేత్త దర్శన్ హీరానందానిపై ఒత్తిడి తెచ్చి, తెల్లకాగితంపై సంతకం చేయించిందని ఆమె ఎక్స్ వేదికగా ఆరోపణలు చేశారు. ఆ కాగితంలోని సమాచారమే తరవాత మీడియాకు లీక్ చేశారని ఆమె ఆరోపించడం రాజకీయ దుమారానికి దారితీసింది.
ఎంపీ మహువా మొయిత్రా ఆరోపణలను హీరానందాని గ్రూప్ సీఈవో దర్శన్ హీరానందాని కొట్టివేశారు. ప్రధాని మోదీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు, అదానీని ఎంపీ మహువా మొయిత్రా లక్ష్యంగా చేసుకున్నారని హీరానందాని ఆరోపించారు. అదానీపై పార్లమెంటులో ప్రశ్నలు వేయడానికి హీరానందాని నుంచి పెద్ద మొత్తంలో ఎంపీ మహువా డబ్బు తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదానీపై పార్లమెంటులో ప్రశ్నలు వేయడానికి, ఎంపీ మహువా పార్లమెంటరీ లాగిన్‌ను కూడా
హీరానందానీ ఉపయోగించుకున్నట్లు ఓ అఫిడవిట్లో ఆయన పేర్కొన్నారు.
హీరానందానికి ఇంత వరకు సీబీఐ, ఇతర ఏ దర్యాప్తు సంస్థ కూడా సమన్లు ఇవ్వలేదు. అలాంటప్పుడు అతడు అఫిడవిట్ ఎవరికి ఇచ్చాడనేది ప్రశ్నార్థకంగా మారింది. దాన్ని హీరానందాని సామాజిక మాధ్యమాల్లో కూడా పోస్ట్ చేయలేదు. కాని కొన్ని మీడియా సంస్థలకు మాత్రమే సమాచారం ఎలా లీక్ అయిందనేది చర్చనీయాంశంగా మారింది.
తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రీ పార్లమెంటులో ప్రశ్నలు వేయడానికి పారిశ్రామిక వేత్త హీరానందాని నుంచి డబ్బు వసూలు చేశారని, లాగిన్ కూడా అతనికే ఇచ్చిందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే గతంలోనే ఆరోపణలు చేశారు. 2019 నుంచి 2023 మధ్య కాలంలో 61 ప్రశ్నల్లో 50 ప్రశ్నలు మహువా, హీరానందానికి కోసమే అడిగారని దుబే ఆరోపించారు. దీనిపై ఐటీ మంత్రిత్వ శాఖకు కూడా ఫిర్యాదు చేశారు. పార్లమెంటరీ లాగిన్ దుర్వినియోగం చేయడం అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించి దర్యాప్తు చేయాలని దుబే లేఖలో పేర్కొన్నారు.