దేశంలోనే మొదటిసారిగా ఢిల్లీ- ఘజియాబాద్-మీరట్ మధ్య రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్, ర్యాపిడ్ ఎక్స్ రైలు సేవలను ప్రధాని మోదీ ఢిల్లీలో ఇవాళ జెండా ఊపి ప్రారంభించారు. దీని ద్వారా ప్రాంతీయ స్థాయిలో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ప్రజలకు రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. షహిబాబాద్ నుంచి దుహి డిపోల మధ్య ఆర్ఆర్టీఎస్ ర్యాపిడ్ ఎక్స్ సేవలు నేటి నుంచి అందుబాటులోకి వచ్చాయి. భారత్‌లో మొదటిసారి ప్రారంభించిన ర్యాపిడ్ ఎక్స్ రైలుకు నమోభారత్ అని నామకరణం చేశారు.
ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్‌లోని షహిబాబాద్ నుంచి దుహి డిపోల మధ్య ఈ సేవలు మొదలయ్యాయి. 2019, మార్చి 8న ప్రధాని మోదీ ర్యాపిడ్ ఎక్స్ రైలు సేవలు అందించడానికి అవసరమైన పనులు చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం షహిబాబాద్-దుహి స్టేషన్ల మధ్య నమో భారత్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. నమో భారత్ రైల్లో షహియాబాద్ నుంచి దుహికి 17 కి.మీ దూరాన్ని కేవలం 12 నిమిషాల్లో చేరుకోవచ్చు. రోడ్డు మార్గంలో వెళ్లాలంటే కనీసం 35 నిమిషాలు పడుతుంది.
ప్రాంతీయంగా రైల్వే సేవలు మెరుగు పరిచేందుకు, ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో వేగవంతమైన సేవలు అందించేందుకు ప్రధాని మోదీ విజన్‌లో భాగంగా ఈ ర్యాపిడ్ ఎక్స్ ప్రారంభించారు. గంటకు 180 కి.మీ. వేగంతో ఈ నమో భారత్ రైళ్లు దూసుకెళతాయి. రద్దీని బట్టి వివిధ స్టేషన్ల మధ్య ప్రతి ఐదు నిమిషాలకు ఒక సర్వీస్ సడపనున్నారు. దూరాన్ని బట్టి నమో భారత్ రైళ్లలో కనిష్ఠంగా రూ.20 నుంచి గరిష్ఠ ఛార్జి రూ.50గా నిర్ణయించారు.పూర్తి ఏసీ కోచ్‌లతో ఈ రైళ్లు తయారు చేశారు.
ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఎనిమిది కారిడార్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. వీటిలో ముందుగా మూడు కారిడార్లలో ఫేజ్-1 కింద పనులు చేపట్టారు. ఢిల్లీ- ఘజియాబాద్-మీరట్ కారిడార్, ఢిల్లీ-గురుగ్రామ్- ఎస్‌ఎన్‌బి కారిడార్, ఢిల్లీ- పానిపట్ కారిడార్లలో పనులు వేగంగా జరుగుతున్నాయి. ఢిల్లీ- ఘజియాబాద్- మీరట్ కారిడార్ అభివృద్ధికి రూ.30000 కోట్లు ఖర్చు కానుందని అంచనా వేశారు. 2025 నాటికి ఈ కారిడార్ పనులు పూర్తి చేయనున్నారు. ప్రతి రోజూ నగరానికి రాకపోకలు సాగించే ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, నగరాల్లోని ఆసుపత్రులకు వచ్చే వేలాది మంది ప్రజలకు ర్యాపిడ్ ఎక్స్ సేవలు ఉపయోగపడతాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.