అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ఓవల్ ఆఫీస్
నుంచి జాతినుద్దేశించి అరుదైన ప్రసంగం చేసారు. ఉక్రెయిన్, ఇజ్రాయెల్ దేశాలకు సాయం
చేయడం అమెరికా ప్రయోజనాల గురించేనని ఆయన తన ఉపన్యాసంలో చెప్పారు. అటు పుతిన్, ఇటు
హమాస్… ఇద్దరూ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే పనిలో ఉన్నారని బైడెన్
వ్యాఖ్యానించారు.
‘హమాస్, పుతిన్… చేస్తున్న బెదిరింపులు
వేర్వేరుగా ఉన్నాయి. కానీ ఆ ఇద్దరిలోనూ సమానంగా ఉన్న లక్షణం ఒకటుంది. అది తమ
పొరుగుదేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని నిర్మూలించడమే’’ అన్నారు బైడెన్.
‘‘ఒక గొప్ప దేశంగా మన బాధ్యతను నిర్వర్తించే
మార్గంలో కోపంతో కూడిన విభజనవాదపు చిల్లర రాజకీయాలు అడ్డంకిగా రావడాన్ని మనం
జరగనివ్వబోము. హమాస్ లాంటి ఉగ్రవాదులు, పుతిన్ లాంటి నిరంకుశులూ గెలిచేలా మనం
చేయలేము, చేయబోము. అలా జరగడాన్ని నేను అడ్డుకుంటాను’’ అని బైడెన్ ప్రకటించారు.
ఉక్రెయిన్, ఇజ్రాయెల్ దేశాలకు భారీ ఆర్థిక సహకారం
అందించేందుకు అంగీకరించాలని ఇవాళ అమెరికన్ కాంగ్రెస్ ముందు ప్రతిపాదన పెడతానని
బైడెన్ చెప్పారు. ప్రపంచ నేతగా అమెరికా భవిష్యత్తుకు అది పెట్టుబడిగా నిలుస్తుందని
ఆయన చెప్పుకొచ్చారు. ‘‘రాబోయే అమెరికన్ తరాలకు భద్రత అనే డివిడెండ్ చెల్లించే
తెలివైన పెట్టుబడి ఇది’’ అని బైడెన్ వ్యాఖ్యానించారు.
‘‘ఈ ప్రపంచాన్ని కలిసికట్టుగా ఉంచేది అమెరికా
నాయకత్వం మాత్రమే. అమెరికా పెట్టుకునే పొత్తులే దేశాన్ని సురక్షితంగా ఉంచుతాయి,
అమెరికా అనుసరించే విలువలే ఇతర దేశాలు మనతో కలిసి పనిచేయడానికి, మనకు
భాగస్వాములుగా ఉండడానికీ కారణమవుతాయి. ఇప్పటికీ, ఇంకా ఇప్పటికీ, ప్రపంచానికి
కాంతికిరణం, వెలుగు బావుటా అమెరికాయే’’ అన్నారు బైడెన్.
ఇజ్రాయెల్‌లో మెరుపు పర్యటన చేసి స్వదేశానికి
చేరుకున్న బైడెన్, 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేందుకు తన ప్రయత్నాలు
తాను చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఉక్రెయిన్, ఇజ్రాయెల్ దేశాలకు మద్దతు గురించి
మాట్లాడుతున్నారు. ఆ రెండు దేశాలకూ ప్రస్తుత యుద్ధ సమయంలో 100 బిలియన్ డాలర్ల ఆర్థిక
సహాయం చేయాలని బైడెన్ ప్రతిపాదించారు.
అమెరికా ఇప్పటికే తూర్పు మధ్యధరా సముద్రంలోకి
రెండు ఎయిర్‌క్రాఫ్ట్ విమానాలను తరలించింది. హమాస్‌కు అండగా నిలుస్తున్న ఇరాన్,
లేదా లెబనాన్ దేశానికి చెందిన హెజ్బొల్లా గ్రూపును ఎదుర్కోవడం వాటి లక్ష్యం.