విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు
నేత్రపర్వంగా సాగుతున్నాయి. శ్రీదుర్గమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం సందర్భంగా
నేడు జగన్మాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీకనకదుర్గమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారములో దర్శనమిస్తున్నారు.
శక్తిస్వరూపాలతో దుష్ట సంహారం చేసిన శ్రీదుర్గాదేవిని శరన్నవరాత్రి ఉత్సవాలలో
మూలానక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతీ అవతారంలో అలంకరించారు.
అర్ధరాత్రి రెండు గంటల నుంచి దర్శనాలు
మొదలయ్యాయి.
వినాయకుడి గుడి నుంచి కొండపై వరకూ భక్తులతో క్యూలైన్లు
కిటకిటలాడుతున్నాయి. సుమారు నాలుగు లక్షల మంది భక్తులు అమ్మ దర్శనానికి వస్తారని
అంచనా వేస్తున్నారు. క్యూలైన్లు నిండిపోవడంతో వీఎంసీ వద్ద కంపార్టుమెంట్లను ఏర్పాటు
చేశారు. మధ్యాహ్నం సీఎం జగన్మోహన్ రెడ్డి, అమ్మవారికి పట్టువస్త్రాలు
సమర్పించనున్నారు.
సరస్వతీదేవిని సేవించడంతో వాగ్దేవి అనుగ్రహం కలిగి విద్యార్థినీ విద్యార్థులు సర్వ విద్యలయందు విజయం పొందుతారు. భక్తులు
మూలానక్షత్రం నుంచి విజయదశమి వరకు విశేష పుణ్య దినాలుగా భావించి శ్రీదుర్గమ్మను
ఆరాధిస్తారు. భక్తజనుల అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించే
జ్ఞానప్రదాయిని శ్రీసరస్వతీదేవి. శ్రీ సరస్వతీదేవి దర్శనం అఖిల
విద్యాభ్యుదయప్రదాయకం.
శ్రీశైలంలో గురువారం సాయంత్రం భ్రమరాంబాదేవి స్కందమాతగా భక్తులను
అనుగ్రహించారు. పద్మం, కమలం ధరించి, అభయహస్తంతో ఒడిలో బాల షణ్ముఖుడైన కుమారస్వామితో భక్తులకు దర్శనమిచ్చారు. శేషవాహనంపై
శ్రీశైల మల్లన్నతో కలిసి భక్తులను అనుగ్రహించారు.
శరన్నవరాత్రుల్లో ఆరో రోజు శుక్రవారం
సాయంత్రం భ్రమరాంబాదేవి అమ్మవారు కాత్యాయని అలంకారంలో దర్శనమివ్వనున్నారు.
మల్లికార్జున స్వామివారికి హంసవాహసేవ నిర్వహించనున్నారు.