ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య తరవాత కెనడా, భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరిగిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో భారత్‌లో ఉన్న మొత్తం 41 మంది కెనడా దౌత్యాధికారులనూ ఉపసంహరించుకున్నట్లు ఆ దేశం ప్రకటించింది. భారతదేశంలో ఉన్న తమ దౌత్యవేత్తలు, ఇతర అధికారుల్లో 20మందికి, వారి కుటుంబాలకూ దౌత్యపరమైన రక్షణను నేటినుంచి తొలగించాలని భారత్ అనైతికంగా ప్రణాళికలు సిద్ధం చేసిందని కెనడా విదేశాంగ శాఖ మంత్రి మెలానీ జోలీ చెప్పారు. ఆ కారణంతో మిగిలిన దౌత్యాధికారులను సైతం తాము ఉపసంహరించుకున్నట్లు ఆమె వెల్లడించారు.
భారత్‌లోని కెనడా దౌత్య కార్యాలయ సిబ్బంది సురక్షితంగా స్వదేశం చేరుకోడానికి ఏర్పాట్లు చేసినట్లు జోలీ తెలిపారు. వారందరూ తమతమ కుటుంబాలతో సహా భారత్ నుంచి కెనడాకు బయల్దేరిపోయారని చెప్పారు.
ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తముందని కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల దౌత్యసంబంధాలూ దెబ్బతిన్నాయి. ఆ నేపథ్యంలో కెనడా భారత్‌పై మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది. గరిష్టస్థాయిలో తమ దౌత్యవేత్తలు, అధికారులకు దౌత్యపరమైన రక్షణను భారత్ ఉపసంహరించిందని కెనడా వాదిస్తోంది.
‘‘ఇటువంటి చర్య ఇప్పటివరకూ ప్రపంచంలో ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. ఇది అంతర్జాతీయ చట్టాలకు పూర్తి విరుద్ధం. అయినా, కెనడా దీనికి ఎలాంటి ప్రతిచర్యా తీసుకోదలచుకోలేదు. పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేయకూడదనే ఉద్దేశంతోనే కెనడా ఏ చర్యలూ తీసుకోకుండా ఉంది. అయితే అంతర్జాతీయ చట్టాల పరిరక్షణకు కెనడా కట్టుబడి ఉంది. అలాగే భారత్‌తో సంబంధాలు కొనసాగిస్తాం’’ అని జోలీ ప్రకటించారు.
‘‘నిజానికి, క్షేత్రస్థాయిలో ఎక్కువమంది దౌత్యవేత్తలు, అధికారులు ఉండవలసిన, పనిచేయవలసిన సందర్భమిది. ఇరు దేశాలూ విస్తృతంగా చర్చించుకోవాల్సిన సమయమిది’’ అని మెలానీ జోలీ అభిప్రాయపడ్డారు.
భారతదేశం ఇప్పటికే కెనడా గడ్డ మీదనుంచి జరుగుతున్న దేశ వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి బోలెడంత సమాచారాన్ని కెనడాకు సమర్పించిందని ఇటీవలే భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ వెల్లడించారు. నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కెనడా చేస్తున్న ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలు చూపించాలని కోరారు. ఖలిస్తానీ ఉగ్రవాదుల వల్ల కెనడాలోని భారత దౌత్యవేత్తలు, అధికారులూ ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరుగుతున్నాయని, అక్కడి భారతీయులు జాగ్రత్తగా ఉండాలనీ సూచించారు. ఈ దౌత్యఘర్షణల నేపథ్యంలో కెనడా వీసా దరఖాస్తుల ప్రోసెసింగ్ ప్రక్రియను భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది.