ఇజ్రాయెల్ హమాస్ మిలిటెంట్ల యుద్ధం నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అక్కడ పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనకు ఆయన ఇవాళ ఇజ్రాయెల్ చేరుకున్నారు. తన ప్రజలకు రక్షించుకునేందుకు ఇజ్రాయెల్ గాజాపై చేస్తోన్న దాడులను ఆయన సమర్థించారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు
రాకెట్ దాడులతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
హమాస్ ఉగ్రవాదులను ఏరివేసేందుకు గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. గాజా పౌరులకు హాని జరగకుండా ఉగ్రవాదులను ఏరివేయాలని, ఈ విషయంలో ఇజ్రాయెల్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ అభిప్రాయపడ్డారు. బ్రిటిష్ పౌరులను సురక్షితంగా తమ దేశం తరలించినందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ధన్యవాదాలు తెలిపారు.
పాలస్తీనా ప్రజలు కూడా హమాస్ బాధితులేనని వారికి మానవతా సాయం చేసేందుకు ఈజిప్టు సరిహద్దులు తెరవడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ప్రజలకు సునాక్ సంఘీభావం తెలిపారు. భయంకరమైన ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొన్న ఇజ్రాయెల్ ప్రజలకు బ్రిటన్ అండగా ఉంటుందని సునాక్ భరోసా ఇచ్చారు. అక్టోబర్ 7న హమాస్ జరిపిన ఘోరమైన దాడిలో 1400 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారని చెప్పారు. హమాస్ ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమానికి ఇప్పటికే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్,ఇటలీ దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచాయి.