గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ ప్రీమియం ఫోన్ పిక్సెల్ సిరీస్ను ఇక నుంచి భారత్లోనే తయారు చేయనుంది. మేకిన్ ఇండియాలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. గూగుల్ ఫర్ ఇండియాలో భాగంగా ఇవాళ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రిక్ ఓస్టెర్లో ఈ ప్రకటన చేశారు.
వచ్చే ఏడాది నుంచి భారత్లో తయారైన గూగుల్ పిక్సెల్ ఫోన్లు అందుబాటులోకి వస్తాయని ఆ సంస్థ వెల్లడించింది. భారత్లో ఫోన్ల తయారీకి వివిధ అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రకటించింది. 2016 నుంచి ఆండ్రాయిడ్ ఆధారిత పిక్సెల్ ఫోన్లను గూగుల్ తయారు చేస్తోంది. ఇటీవల గూగుల్ పిక్సెల్ 8 వెర్షన్ ఫోన్ విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.75999గా ఉంది.
ప్రధాని మోదీ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్తో ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియాలో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశం తరవాత గూగుల్ నుంచి ఈ ప్రకటన రావడం విశేషం.