శివసేన యూబీటీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీని హమాస్ తీవ్రవాదులతో పోల్చారు. ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల యుద్ధం నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై అస్సాం సీఎం హిమాంత బిస్వ శర్మ ప్రతిస్పందించారు. అస్సాం సీఎం వ్యాఖ్యలపై సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ హమాస్ కంటే తక్కువేం కాదంటూ సంజయ్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కేంద్ర ఏజన్సీలను దుర్వినియోగం చేస్తూ దేశంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తోందని సంజయ్ రౌత్ ధ్వజమెత్తారు. విమర్శలు చేసే ముందు శరద్ పవార్ ఏం మాట్లాడారో తెలుసుకోవాలని హితవు పలికారు.
ఇంతకు ముందు అస్సాం సీఎం హిమాంత బిస్వ శర్మ, శరద్ పవార్, ఆయన కూతురు ఎంపీ సుప్రియా సూలేపై నేరుగా విమర్శల దాడి చేశారు. సుప్రియా సూలేను శరత్ పవార్ గాజాలో హమాస్ తీవ్రవాదుల తరపున యుద్ధం చేసేందుకు పంపేలా ఉన్నారంటూ అస్సాం సీఎం విమర్శించారు.
అస్సాం సీఎం వ్యాఖ్యలపై ఎంపీ సుప్రియా సూలే ఇవాళ స్పందించారు. శరద్ పవార్ ఏం మాట్లాడారో చూసి, తరవాత స్పందిస్తే బాగుంటుందని ఆమె అన్నారు.
అస్సాం సీఎం వ్యాఖ్యలపై తాను ద్రిగ్భ్రాంతికి గురైనట్లు సుప్రియా తెలిపారు. మేమంతా కాంగ్రెస్ నుంచి వచ్చాం. ఒకటే డీఎన్ఏ. మహిళలను బీజేపీ ఎలా అగౌరవ పరుస్తుందో అందరికీ తెలుసని సుప్రియా చెప్పారు.
రెండు రోజుల కిందట ముంబైలో జరిగిన ఎన్సీపీ నేతల సమావేశంలో శరద్ పవార్ మాట్లాడారు. గతంలో మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, అటల్ బిహారి వాజ్పాయ్ అందరూ పాలస్తీనాకు మద్దతు పలికారని ఆయన గుర్తు చేశారు. విచిత్రంగా ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు వంతపాడుతోందన్నారు. గాజాలో పాలస్తీనియన్లు పడుతున్న ఇబ్బందులను గుర్తుచేసుకోవాలని, అది వారి సొంత గడ్డని శరద్ పవార్ చెప్పారు. దీనిపై అస్సాం సీఎం ఘాటుగా స్పందించారు. బీజేపీ ఐటీ విభాగం శరద్ పవార్ ఏం మాట్లాడారో తెలుసుకుని విమర్శలు చేస్తే బాగుంటుందని ఎంపీ సుప్రియా సూలే చురకలు వేశారు.