ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అక్కడ పర్యటించారు. ఇజ్రాయెల్ దాడులతో ధ్వంసమైన గాజాకు అమెరికా అధ్యక్షుడు భారీ సాయం ప్రకటించారు. గాజాకు 100 మిలియన్ డాలర్లు సాయం ప్రకటించారు. గాజాకు సాయం అందాలంటే ఈజిప్ట్‌లోని రఫా సరిహద్దు నుంచి ట్రక్కులు ప్రవేశించాల్సి ఉంది. అయితే ఈజిప్ట్ ప్రస్తుతం రఫా సరిహద్దు మూసివేసింది. గాజాకు సాయం అందించే ట్రక్కులకు మార్గం సుగమం చేయాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసిని కోరారు. అందుకు వారు అంగీకరించారు. దీంతో గాజాకు అత్యవసర మందులు, ఆహారం, తాగునీరు అందించనున్నారు.
గాజాకు మానవతా సాయం చేయడానికి అమెరికా అధ్యక్షుడు పలు దేశాల అధినేతలతో చర్చలు జరిపారు. గాజాకు సాయం అందించేందుకు ఈజిప్ట్ కూడా ముందుకు వచ్చింది. యుద్ధం మరింత ముదరకుండా, అక్కడ శాంతి నెలకొల్పేందుకు కృషి జరుగుతోంది.
హమాస్ ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఇజ్రాయెల్ గాజాపై దాడులు కొనసాగిస్తోంది. ఇప్పటికే ఉత్తర గాజాలో లక్షలాది మంది ప్రజలు ఖాళీ చేసి దక్షిణ ప్రాంతాలకు వలసపోయారు. ఇజ్రాయెల్ వైపు అన్ని సరిహద్దులు మూసివేయడంతో లక్షలాది మంది ఈజిప్టు సరిహద్దు రఫాకు చేరుకున్నారు. అక్కడ కూడా సరిహద్దులు
మూసివేశారు. అమెరికా అధ్యక్షుడి చొరవతో రఫా సరిహద్దులు తెరిచేందుకు ఈజిప్టు అధ్యక్షుడు అంగీకరించారు. గాజా ప్రజలకు సాయం అందించేందుకు వందలాది
ట్రక్కులు రఫా సరిహద్దు వద్ద బారులు తీరాయి. ఇవాళ గాజాలోకి ప్రవేశించే అవకాశం ఉంది.