రాష్ట్రవ్యాప్తంగా
దసరా ఉత్సవాలు అంబరాన్ని అంటుతున్నాయి. భక్తుల కోలాహలం మధ్య నవరాత్రి ఉత్సవాలు
నేడు ఐదోరోజుకు చేరుకున్నాయి. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా బెజవాడ
శ్రీకనకదుర్గమ్మవారు శ్రీమహాచండీదేవిగా దర్శనమిస్తున్నారు.
దేవతల
కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం మహాలక్ష్మీ, మహాకాళీ, మహాసరస్వతీ
త్రిశక్తి స్వరూపిణీగా శ్రీమహాచండీ అమ్మవారు ఉద్భవించారు. శ్రీచండీఅమ్మవారిలో అనేక
మంది దేవతలు కొలువై ఉన్నారు. ఈ రూపంలోని అమ్మవారిని కొలిస్తే విద్య, కీర్తి,
సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారటం ఖాయం.
ఆదిదంపతుల
నామస్మరణతో శ్రీగిరి మార్మోగుతోంది. శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా
జరుగుతున్నాయి. బుధవారం నాడు భ్రమరాంబాదేవి కుష్మాండదుర్గగా ప్రత్యేక
పూజలందుకున్నారు. దేవి అవతారాల్లో కుష్మాండ దుర్గ సాత్విక రూపంలో సింహవాహనాన్ని
అధిష్టించి ఎనిమిది చేతుల్లో కుడివైపు పద్మం, బాణం, ధనస్సు, కమండలం, ఎడమవైపు
చక్రం, గద, జపమాల, అమృతకళశాన్ని దాల్చి భక్తులకు దర్శనమిచ్చారు. మల్లికార్జున స్వామివారు
కైలాసవాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
నేడు
అమ్మవారు స్కందమాతా అలంకారంలో భ్రమరాంబాదేవి భక్తులను తరింపజేస్తారు. మల్లికార్జున
స్వామివారితో కలిసి శేష వాహనసేవలో భక్తులను కటాక్షిస్తారు.