కృష్ణా జిల్లా కంకిపాడులో భారీ చోరీ చోటు చేసుకుంది. కంకిపాడులోని మణప్పురం గోల్డ్‌లోన్ బ్రాంచి కార్యాలయంలో దుండగులు 10 కేజీలకుపైగా బంగారం దోచుకెళ్లారు. దీని విలువ రూ.6 కోట్లు ఉంటుందని అంచనా. బ్రాంచ్‌లో పనిచేసే పావని అనే ఉద్యోగి, మరో వ్యక్తితో కలసి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. చోరీ గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
బ్రాంచ్‌లో మొత్తం 16 కేజీల బంగారం తాకట్టులో ఉండగా, 10.660 కేజీల బంగారం చోరీ అయినట్లు గుర్తించారు. కంకిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితురాలు పావనికి సహకరించిన వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చోరీకి పాల్పడిన పావని కోసం పోలీసులు గాలిస్తున్నారు.