చక్కెర ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పొడిగించింది. గతంలో విధించిన గడువు అక్టోబర్ 31తో ముగిసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చక్కెర ఎగుమతులపై నిషేధం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో వెల్లడించింది. ముడి చక్కెర, వైట్ షుగర్, శుద్ధి చేసిన పంచదార, సేంద్రీయ పంచదార ఎగుమతులపై ఈ ఆంక్షలు విధించారు.
దేశంలో చక్కెర నిల్వలు అడుగంటిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దక్షిణ భారతంలో కరవుతో చక్కెర తయారీ కూడా భారీగా తగ్గే అవకాశాలు ఉండటంతో మార్కెట్లో చక్కెర కొరత ఏర్పడే ప్రమాదముందని కేంద్రం ఈ చర్యలకు ఉపక్రమించింది.
బియ్యం ఎగుమతులపై ఆంక్షలను కేంద్రం సడలించింది. నేపాల్, కేమరూన్, ఐవరీ కోస్ట్, గునియా, మలేషియా, పిలిఫ్పైన్స్, సైచిలెస్ దేశాలకు బియ్యం ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని తొలగించింది. పారాబాయిల్డ్ బియ్యం ఎగుమతులపై కేంద్రం 20 శాతం ఎగుమతి సుంకం విధించింది. ఇది వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని కేంద్రం ప్రకటించింది. బాస్మతియేతర బియ్యం ఎగుమతులను భారత్ ఇప్పటికే నిషేధించింది. అయితే కొన్ని దేశాలకు బియ్యం ఎగుమతులకు అంగీకారం తెలిపింది.