ఈ నెల అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు 5 వేల రాకెట్లతో భీకరదాడి చేసిన సంగతి తెలిసిందే. పది రోజులకు పైగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతోన్న యుద్ధం తీవ్రం కావడం, ఇరు పక్షాల్లో వేలాది మంది చనిపోవడంతో ప్రపంచ దేశాలు గాజాలో శాంతి నెలకొల్పోందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమపై దాడులు ఆపితే బందీలను విడిచిపెడతామంటూ హమాస్ ఉగ్రవాద సంస్థ చెప్పినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసిన హమాస్ ఉగ్రవాదుల చెరలో ఇంకా వంద మందికిపైగా అమాయకులు బందీలుగా ఉన్నట్లు తెలుస్తోంది.
గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులు నిలిపేస్తే, గంటలోనే మా వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్, ఇతర దేశాల పౌరులను విడిచిపెడతామని హమాస్ పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బందీలను విడిచిపెట్టేందుకు సురక్షిత ప్రదేశం లేనట్లు హమాస్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన హమాస్ అధికారి ఎవరనేది తెలియరాలేదు.
యుద్ధం తాము మొదలు పెట్టలేదు, కానీ ముగింపు పలుకుతామంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. ఆ తరవాత ఇజ్రాయెల్ గాజాలో హమాస్ ఉగ్రవాదులు లక్ష్యంగా భీకరదాడులకు దిగింది. ఉత్తర గాజాలో ప్రజలను ఖాళీ చేయించింది. ఈ సమయంలో అక్కడి ప్రజలను హమాస్ రక్షణ కవచాలుగా వాడుకుంటోన్నట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. తాజాగా గాజాలోని ఓ ఆసుపత్రిలో చోటుచేసుకున్న పేలుడులో 500 మంది చనిపోయారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్, హమాస్ పరస్పర ఆరోపణలకు దిగాయి.