ఇజ్రాయెల్ గాజా యుద్ధంతో అట్టుడికిపోతోన్న గాజాలో పరిస్థితులు మరింత దిగజారాయి. గాజా ఆసుపత్రిలో సంభవించిన పేలుడులో 500 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఇది హమాస్ తీవ్రవాదుల పనేనని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఆరోపించారు. గాజా ఆసుపత్రిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసిందంటూ హమాస్ ఆరోపిస్తోంది.
గాజా ఆసుపత్రిపై జరిగిన దాడి ఉగ్రమూకల పనేనని ఇజ్రాయెల్ చెబుతోంది. ప్రపంచం యావత్తు ఇది గ్రహించాలని ఆ దేశ ప్రధాని కోరారు.మా పిల్లలను అత్యంత పాశవికంగా హత్య చేసిన హమాస్ ఉగ్రవాదులు, వారి పిల్లలను కూడా చంపేస్తున్నారని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆరోపించారు. ఐడీఎఫ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. గాజాలోని ఓ ఆసుపత్రి సమీపంలో హమాస్ ఉగ్రవాదులు ప్రయోగించిన రాకెట్లు గురితప్పి అక్కడే పేలాయని ఐడిఎఫ్ తెలిపింది.
గాజా ఆసుపత్రి పేలుడుపై అమెరికా అధ్యక్షుడు స్పందించారు. ఈ ఘటనపై బైడెన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌లో అమెరికా అధ్యక్షుడు పర్యటనకు ఒక రోజు ముందే ఇలాంటి ఘటన జరగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. జోర్డాన్‌లో అమెరికా అధ్యక్షుడి పర్యటన కూడా రద్దైంది. జోర్డాన్ అధినేత, ఈజిప్టు ప్రధాని, పాలస్తీనా అధ్యక్షుడితో బైడెన్ సమావేశం కావాల్సి ఉంది. ఆసుపత్రిపై దాడి ఘటన తరవాత బైడెన్ జొర్డాన్ పర్యటన రద్దైంది.