తిరుమల
తిరుపతి వేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు
స్వామివారు కల్పవృక్ష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిగా కొలువుదీరారు.
రాత్రికి సర్వభూపాల వాహన సేవలో భాగంగా తిరుమాడ వీధుల్లో విహరించనున్నారు.
ఈ నెల 19న స్వామివారికి గరుడసేవ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భారీ
బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి చెప్పారు. బ్రహ్మోత్సవాల
సందర్భంగా 1800 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని, గరుడ సేవ రోజు
1253 మంది అదనంగా విధులు నిర్వహిస్తారని చెప్పారు. ఆరోజు ఘాట్ రోడ్డుతో పాటు
తిరుపతిలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు.
మంగళవారం
రాత్రి ముత్యపు పందిరి వాహనంపై నుంచి
దర్శనమిచ్చిన దేవదేవుడు, భక్తులకు అభయప్రదానం చేశారు. ముత్యాల నిర్మలకాంతుల
వ్యాప్తికి ఆ కాంతులు దర్శించి భక్తులు
ముక్తి పొందడానికి రాత్రి వేళ అనుకూలం. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి శరీరాన్ని,
ఆధ్మాత్మిక సంపదతో శుద్ధి చేసుకుని బుద్ధి ముత్యంలా మారి, జనన, మరణ చక్రం నుంచి
విడుదలై మోక్షం పొందుతుంది.
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనానికి
నేరుగా క్యూలైన్ లోకి అనుమతిస్తున్నారు.
సర్వ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 72,123మంది దర్శించుకున్నారు.
26,054 మంది తిరుమలేశుడికి తలనీలాలు సమర్పించారు. స్వామికి హుండీ కానుకల ద్వారా
రూ.3.01 కోట్ల ఆదాయం లభించింది.