ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం తీవ్రంగా జరుగుతున్న వేళ ఫ్రాన్స్‌లో ఉపాధ్యాయుడిని పొడిచి చంపిన వ్యవహారం ఆందోళనకు దారితీసింది. గతవారం ఉత్తర ఫ్రాన్స్‌లో ఓ ఉపాధ్యాయుడిని హత్య చేసి చంపిన మహమ్మద్ ముగుచ్‌కోవ్‌కు ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని తేలింది. ఉపాధ్యాయుడి హత్య తరవాత అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
ఐసిస్ ఉగ్రవాదులను సమర్థిస్తూ మొగుచ్‌కోవ్ చేసిన వీడియోలు లభించాయి. దీంతో అతనిపై ఉగ్రవాద నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేశారు. చెచెన్యాకు చెందిన మహమ్మద్ ముగుచ్‌కోవ్ సుధీర్ఘంగా చేసిన వీడియోలో ఐసిస్ ఉగ్రవాదులకు అనుకూలంగా రికార్డ్ చేశాడని తేలింది. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని సమర్థిస్తూ కూడా ఆ వీడియోలో ఉన్నట్లు విచారణలో బయటపడింది.
ఉత్తర ఫ్రాన్స్‌లోని ఓ పాఠశాలలో డొమినిక్ బెర్నార్డ్ అనే ఉపాధ్యాయుడిని కత్తితో పొడిచి చంపడానికి ముందు మహమ్మద్ ముగుచ్‌కోవ్‌కు అతని తమ్ముడు కొంత సాయం చేశాడని తేలడంతో అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చెచెన్యాలోని ముస్లింలు అధికంగా నివశించే ప్రాంతం నుంచి మహమ్మద్ మొగుచ్‌కోవ్ ఫ్రాన్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.