రాష్ట్రంలో
శరన్నవరాత్రి మహోత్సవాల కోలాహలం కొనసాగుతోంది. ఆలయాల్లో అమ్మవారిని శాస్త్రోక్తంగా
అలంకరిస్తూ భక్తిని చాటుకుంటున్నారు. దేవీమహత్యాల ప్రవచనాలతో తెలుగునేల పులకించిపోతుంది.
అమ్మవారు
దుర్గమ్మగా కొలువుదీరిన విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరామహోత్సవాలు తెలుగు
సంప్రదాయాలను మరింత ఇనుమడింపజేస్తున్నాయి.
పరాశక్తి దర్శనం కోసం తెలుగురాష్ట్రాల
నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఉత్సవాల నాలుగోరోజు దుర్గమ్మవారు,
శ్రీమహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. మంగళప్రదమైన దేవత మహాలక్ష్మీదేవిని
దర్శించుకుంటే సర్వశుభాలు చేకూరతాయని నమ్మకం. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య,
సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమష్టి రూపమైన అమృతి
స్వరూపిణిగా అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తున్నారు.తెల్లవారుజామున
నాలుగు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనభాగ్యాన్నికల్పిస్తున్నారు.
శ్రీశైలంలో
దసరా మహోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. నిన్న చంద్రఘంటాదేవి అలంకారంలో
భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చారు. నేడు అమ్మవారు కుష్మాండదుర్గ అలంకారంలో
భక్తులను ఆశీర్వదిస్తారు. మల్లికార్జున స్వామి కైలాస వాహన సేవలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
కూష్మాండదుర్గను ఉపాసించడంతో రోగాలు, శోకాలు తొలగిపోతాయి. ఆరోగ్యం చేకూరడంతో పాటు
ఆయువు, యశస్సు వృద్ధి చెందుతుందని భక్తుల విశ్వాసం.