ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హమాస్ ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో ఇజ్రాయెల్ సైన్యం, గాజాలోని ఓ ఆసుపత్రిపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో వందలాది మంది చనిపోయారనే వార్తలు వస్తున్నాయి. కనీసం 500 మంది చనిపోయి ఉండవచ్చని అంతర్జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది.
ఇజ్రాయెల్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ పర్యటనకు ఒక రోజు ముందు ఈ దాడులు జరగడంపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆసుపత్రిలో జరిగిన పేలుడు, అక్కడి ప్రాణనష్టంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాజాలోని అల్ అహ్లీ అరబి బాప్టిస్ట్ ఆసుపత్రిపై దాడి వెనుక ఇజ్రాయెల్ హస్త ముందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
హమాస్ ఉగ్రవాదుల రాకెట్ల మిస్ ఫైరింగ్ వల్లే ఈ పేలుడు సంభవించిందని ఇజ్రాయెల్ నిందిస్తోంది. ఇజ్రాయెల్ చేసిన ఘోరమైన తప్పిదం నుంచి బయటపడే ప్రయత్నం చేస్తోందని హమాస్ మిత్ర పక్షమైన ఇస్లామిక్ జిహాద్ ఒక ప్రకటనలో తెలిపింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కూడా ఈ దాడిని ఖండించారు. అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం ఆసుపత్రులపై దాడులు చేయడం నేరంగా పరిగణిస్తామని ఆయన అన్నారు.
గాజా ఆసుపత్రిపై దాడి తరవాత ఇరాన్‌లోని ఫ్రాన్స్, ఇంగ్లాండ్ రాయబార కార్యాలయాల వద్ద వందలాది మంది నిరసనలకు దిగారు. ఇరాన్‌లో ఒక రోజు సంతాప దినంగా ప్రకటించారు.