స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్దత కల్పించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన కేసులో ఇవాళ కీలక తీర్పు వెలువడింది. స్వలింగ సంపర్కుల
వివాహానికి చట్టబద్దత కల్పించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ వ్యవహారాన్ని పార్లమెంట్ తేర్చాలని సూచించింది. అయితే స్వలింగ సంపర్కులు సహజీవనంలో ఉండొచ్చని తెలిపింది. వారిపై ఎలాంటి వివక్ష చూపొద్దని, వారి హక్కులు కాపాడాల్సిన భాద్యత కేంద్ర, రాష్ట్రాలపై ఉందని తీర్పులో పేర్కొంది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బెంచ్ ఈ తీర్పు వెలువరించింది. ఈ కేసుపై సుప్రీంకోర్టులో 10 రోజుల పాటు సుదీర్ఘ వాదలు జరిగాయి. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు నాలుగు వేర్వేరు
తీర్పులు వెలువరించింది.
స్వలింగ సంపర్కులు పిల్లలను దత్తత తీసుకోవడం సహా పలు అంశాలపై ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. స్వలింగ సంపర్కం కొన్ని వర్గాలకే పరిమితమైందనే అభిప్రాయం వీడాలన్నారు. స్వలింగ సంపర్కుల వివాహాలకు ప్రస్తుతం గుర్తింపు లేదు. వివాహ చట్టాలను చేయాల్సిన బాధ్యత పార్లమెంటుపై ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.