తమిళనాడులో
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ర్యాలీ జరపకుండా డీఎంకే నేతృత్వంలోని
రాష్ట్రప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణ్
తిరుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ర్యాలీ
నిర్వహణకు మద్రాస్ హైకోర్టు అనుమతి ఇచ్చిందని చెప్పిన నారాయణ్ తిరుపతి, ఆర్ఎస్ఎస్
పేరు వింటే డీఎంకే నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఆర్ఎస్ఎస్ చేపట్టబోయే ర్యాలీ రాజకీయ సమ్మేళనం కాదని,
కేవలం సాంస్కృతిక కార్యక్రమమే అయినప్పటికీ డీఎంకే ప్రభుత్వం సహకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ
నెల 22 నుంచి 29 వరకు ఐదు రోజుల పాటు రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ మార్చ్ నిర్వహణకు
అనుమతి మంజూరు చేసిన అత్యున్నత న్యాయస్థానం, అందుకు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని
ప్రభుత్వానికి సూచించింది.
ఆర్ఎస్ఎస్
చేపట్టబోయే మార్చ్ లో రౌడీలు, అసాంఘిక శక్తులు జోరబడే ప్రమాదం ఉందని ప్రభుత్వం
ఇప్పుడు చెప్పడం సరికాదని నారాయణ్ తిరుపతి అన్నారు. అలాంటి వారిని ప్రభుత్వం, పోలీసులు గుర్తించి ఇప్పటికే చర్యలు
తీసుకోవాల్సిందన్నారు. ఏడాదిగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇప్పుడు ర్యాలీని ఆపేందుకు
సాకులు చెప్పడం సరికాదన్నారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమిళనాట బీజేపీకి అనుకూల
పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రధాని మోదీ సారథ్యంలోకి కేంద్రప్రభుత్వం అమలు చేస్తోన్న
సంక్షేమ కార్యక్రమాలతో తమ పార్టీకి ప్రజాదరణ పెరిగిందన్నారు. బీజేపీ రాష్ట్ర
అధ్యక్షుడు అన్నామలై కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పార్టీని బలోపేతం
చేస్తున్నారన్నారు. 2020-21 నుంచే సాధారణ ఎన్నికలపై తమ పార్టీ దృష్టి సారించిందని
వివరించారు.