ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల యుద్ధం భీకరంగా సాగుతున్న వేళ, ఆ గడ్డపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ పర్యటించనున్నారు. బుధవారం అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తారని వైట్‌హౌస్ అధికారికంగా ప్రకటించింది. ఇజ్రాయెల్ పర్యటన అనంతరం బైడెన్ జోర్డాన్ రాజధాని అమ్మన్ వెళతారని శ్వేతశౌధం ప్రకటించింది. జోర్డాన్ రాజు అబ్దుల్లా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతే అల్ సిసి, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో సమావేశం నిర్వహిస్తారు.
అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఇప్పటికే ఈజిప్ట్ అధ్యక్షుడు, ఇరాన్ ప్రధానితో ఫోన్ సంభాషణలు జరిపారు. గాజా ప్రాంతంలో పరిస్థితులపై చర్చించారు. అక్కడ పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు దేశాల అధినేతలతో చర్చలు జరిపారు. గాజాలో మానవతా సంక్షోభం తలెత్తకుండా ఉండేందుకు ఐక్యరాజ్యసమితితో సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపట్టాలని ఇరాన్, ఈజిప్ట్ దేశాధినేతలకు సూచించారు. ఇజ్రాయెల్‌లో అమెరికా అధ్యక్షుడి పర్యటన ప్రకటనపై ఇరాన్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.