రాష్ట్రవ్యాప్తంగా
దసరా ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జగజ్జనని స్మరణతో ప్రతీ ఊరూ
మార్మోగుతోంది. స్థానిక సంప్రదాయాలను అనుసరించి అమ్మవారికి నవరాత్రులు
శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. రోజుకో అలంకారంలో శ్రీమాతను ఆరాధిస్తూ అనుగ్రహం
పొందుతున్నారు.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజున బెజవాడ
ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మవారు, శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులను
కటాక్షిస్తున్నారు. ఉదయం నాలుగు గంటల నుంచి అమ్మవారి దర్శనభాగ్యం కలుగుతోంది.
శ్రీ
అన్నపూర్ణా దేవి అన్నమును ప్రసాదించే మాతృమూర్తి. అన్నం సర్వజీవనాధారం, అన్నం
లేనిదే జీవులకు మనుగడ లేదు. శ్రీ అన్నపూర్ణదేవి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో
ఉన్న అమృతాన్నము, వజ్రాలు పొదిగిన గరిటెతో సాక్షాత్తుగా ఈశ్వరునికే భిక్షను
ప్రసాదించే అంశము అద్భుతం. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో శ్రీదుర్గమ్మను
దర్శించడంతో అన్నాదులకు లోపం లేకుండా, ఇతరులకు అన్నదానం చేసే సౌభాగ్యాన్ని
పొందగల్గుతారు.
నవరాత్రి
ఉత్సవాలు రెండోరోజైన సోమవారం నాడు అమ్మవారు శ్రీగాయత్రి దేవిగా దర్శనమిచ్చి
భక్తులను అనుగ్రహించారు.
జ్యోతిర్లింగ
క్షేత్రమైన శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సాయంత్రం
చంద్రఘంటా అలంకారంలో భ్రమరాంబ అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రికి ఆది
దంపతులకు రావణ వాహన సేవ నిర్వహిస్తారు.