హమాస్ ఉగ్రవాదులకు సహకరిస్తోన్న హెజ్బొల్లా మిలిటెంట్లను ఏరివేసేందుకు ఇజ్రాయెల్ లెబనాన్‌లోని నిర్దేశిత లక్ష్యాలపై దాడులకు దిగింది. సోమవారం నాడు హెజ్బొల్లా ఉగ్రవాదులకు ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య కాల్పులు చోటు చేసుకున్నట్లు లెబనాన్ ప్రకటించింది.
లెబనాన్‌లోని హెజ్బొల్లా ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపిందని ఐఏఎఫ్ మాజీ అధికారి ఒకరు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. లెబనాన్ సరిహద్దుల్లోని సైనిక స్థావరాలపై దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ సోమవారం నాడు వెల్లడించింది. మిలిటెంట్ల యుద్ధ ట్యాంకులను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.
లెబనాన్ సరిహద్దుల నుంచి జరుగుతోన్న దాడులను కూడా సమర్ధవంతంగా తిప్పికొట్టినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ అధికారులు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో షురా కౌన్సిల్‌కు చెందిన ఉగ్రవాది ఒసామా మజిని హతమైనట్లు ప్రకటించింది. గాజాలో హమాస్ ఉగ్రవాదులకు చెందిన షురా కౌన్సిల్‌కు ఒసామా మజిని అధిపతిగా ఉన్నట్లు ఐఏఎఫ్ అధికారులు ప్రకటించారు.