తమ
సముద్రజలాల్లో అక్రమంగా చొరబడ్డారంటూ భారత్‌కు చెందిన 27 మంది జాలర్లను శ్రీలంక
నావికాదళం అరెస్టు చేసింది. ఐదు బోట్లను కూడా సీజ్ చేసింది.
తమిళనాడు
లోని రామనాథపురం వాసులు సముద్ర జలాల్లో చేపల వేటకు వెళ్ళగా తమ పరిధిలోకి వచ్చారంటూ శ్రీలంక నిర్భందించింది.
శ్రీలంక నావికాదళం తీరును స్థానిక మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు.
తమ వారిని నిర్బంధించడాన్ని నిరసిస్తూ బంద్‌కు పిలుపునిచ్చారు. దాదాపు 7 వేలమంది
మత్స్యకారులు వేటను నిలిపివేసి ఆందోళనకు దిగారు. తమ సమస్కల పరిష్కారానికి
ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బుధవారం నాడు తమ ఆందోళనను మరింత
తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
మత్స్యకారులు
బందును విరమించాలని కేంద్రమంత్రి ఎల్ మురుగున్ కోరారు. దౌత్య పరమైన ద్వైపాక్షిక
చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం
దొరుకుతుందన్నారు. బంద్ ప్రభావం ఈ ప్రాంతంలోని సుమారు 15 వేల మంది జీవితాలపై
పడుతుందని సర్ది చెప్పారు.
కేంద్రమంత్రి
జయశంకర్ తో మాట్లాడిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, భారత జాలర్ల విడుదలకు చర్యలు
తీసుకోవాలని కోరారు. తరచూ అరెస్టులు జరుగుతుండటంతో మత్స్యాకారులు భయాందోళనకు గురికావడంతో
పాటు కోస్తా ప్రాంతంలో అశాంతి
రేగుతోందన్నారు.
అరెస్టులతో
ఆదాయాన్ని కోల్పోవడంతో పాటు బాధిత కుటుంబాలకు ఆహార భద్రత కూడా ఉండటంలేదని ఆవేదన
వెలిబుచ్చారు.
తమ
జలాల్లోకి చొరబడ్డారంటూ గడిచిన కొన్ని దశాబ్దాల కాలంలో దాదాపు 600 మంది జాలర్లను
శ్రీలంక నావికాదళం కాల్చివేసింది. ఇటీవల కాలంలో ఈ ఘటనలు తగ్గుముఖం పట్టాయి.
ఈ ఏడాది
137 మందిని అరెస్టు చేసిన శ్రీలంక నేవీ, 22 బోట్లను సీజ్ చేసింది.
మన
సముద్ర జలాల్లో చేపలు తక్కువ సంఖ్యలో ఉండటంతో
శ్రీలంక సరిహద్దులోకి వెళ్ళాల్సి వస్తోందని జాలర్లు చెబుతున్నారు.
ఈ
సమస్యకు తమిళనాడు ప్రభుత్వం రెండు రకాల పరిష్కారాలను కేంద్రానికి సూచిస్తోంది. శ్రీలంకకు
బహుమతిగా ఇచ్చిన కచ్చాదీవులు వెనక్కి తీసుకోవడం ఒకటి. రెండోది శ్రీలంక జలాల్లో వేట
కోసం లీజు చెల్లించే ఒప్పందం చేసుకుంటే మేలు అని చెబుతోంది.