హమాస్
మిలిటెంట్లే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న పోరును ఇరాన్ మరోసారి
తప్పుబట్టింది. పాలస్తీనీయులపై దురాక్రమణను తక్షణమే నిలిపివేయకపోతే తీవ్ర పరిణామాలు
ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇజ్రాయెల్ పై కఠిన చర్యలు చేపట్టేందుకు
తాము సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమిరబ్దోల్లాహియాన్ చెప్పినట్లు
అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
గాజాలో
దురాక్రమణ ఆపకపోతే ఈ ప్రాంతంలోని మిగతా దేశాల చేతులు ట్రిగ్గర్ పైనే ఉన్నాయన్నారు.
ఇజ్రాయెల్‌కు మద్దుతు పలుకుతున్న అమెరికాను కూడా ఇరాన్ దుయ్యబట్టింది. పరిస్థితులు
నియంత్రిస్తామని, ఘర్షణలు విస్తరించకుండా చూస్తామని ఎవరూ హమీ ఇవ్వలేదని
మండిపడ్డారు.
గాజాపై పోరులో బాగంగా అమాయక పౌరులపై జరుగుతున్న అనాగరిక చర్యలు
అడ్డుకోవాలని అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
హమాస్
దాడుల వెనుక ఇరాన్ హస్తం ఉండొచ్చని తొలుత అమెరికా అనుమానాలు వ్యక్తం చేసింది.
అయితే ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఇరాన్ నేరుగా జోక్యం
చేసుకునే అవకాశముందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ ఆందోళన వ్యక్తం
చేశారు.
యుద్ధంలో
హిజ్బుల్లా చేరితే, ఇది మధ్య ప్రాచ్యంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించవచ్చని ,
తద్వారా ఇజ్రాయెల్ భారీ ఉపద్రవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని గతంలో ఇరాన్
హెచ్చరించింది. లెబనాన్ లో హిజ్బుల్లా సంస్థకు ఇరాన్ అండదండలు ఉన్నాయి.