నిఠారీ హత్య కేసు దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. 2005 నుంచి 2006 మధ్యలో ఉత్తరప్రదేశ్ నొయిడాలోని నిఠారీ ప్రాంతంలో చోటు చేసుకున్న హత్యలు వెలుగు చూడటం అప్పట్లో పెను సంచలనానికి దారితీశాయి. మోనీందర్ సింగ్ పంధేర్ ఇంటిలో వరస హత్యలు జరిగాయి. ఈ హత్యల్లో సురీందర్ కోలీకి ట్రయల్
కోర్టు మరణ శిక్ష విధించింది. 12 కేసుల్లో తాజాగా అలహాబాద్ హైకోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో సహ నిందితుడు మోనీందర్ సింగ్ పంధేర్ కూడా నిర్దోషిగా విడుదలయ్యాడు. ఇద్దరి మరణ శిక్షలను అలహాబాద్ హైకోర్టు రద్దు చేసింది.
ఉత్తరప్రదేశ్ నొయిడాలోని నిఠారీ ప్రాంతంలో 2005, 2006లో మోనీందర్ సింగ్ పంధేర్ ఇంటిలో వరుస హత్యలు జరిగాయి. పంధేర్ ఇంటిలో సురీందర్ కోలీ సహాయకుడిగా పనిచేశాడు. నిఠారీ హత్యలు అప్పట్లో దేశం మొత్తాన్ని భయభ్రాంతులకు గురిచేశాయి. సురీందర్ కోలీ తన యజమాని ఇంట్లో అనేక మంది పిల్లలపై అత్యాచారం, హత్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. 20 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో వీరిద్దరినీ ట్రయల్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. పంధేర్ ఇంటి సమీపంలోకి కాలువలో తప్పిపోయిన చిన్నారి మృతదేహాన్ని గుర్తించడంతో కేసు వెలుగులోకి వచ్చింది.