ఇజ్రాయెల్ హమాస్ తీవ్రవాదుల యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హమాస్ తీవ్రవాదులను ఏరివేసేందుకు ఇజ్రాయెల్ దళాలు గాజాలో సుదీర్ఘం కాలం పాటు ఉండాల్సి రావడం పెద్ద పొరపాటే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇజ్రాయెల్ యుద్ధ నియమాలు పాటిస్తుందనే నమ్మకం తమకుందన్నారు. గాజాలోని అమాయక పౌరులకు నీరు, ఆహారం, విద్యుత్ అందేలా చూడాలన్నారు.
గాజా ప్రాంతంలో హమాస్ తీవ్రవాదులను ఏరివేసే కార్యక్రమంలో ఇజ్రాయెల్ ఆ ప్రాంతాన్ని సుదీర్ఘ కాలం తమ గుప్పిట్లో పెట్టుకుంటే పెద్ద పొరపాటే అవుతుందని బైడెన్ అభిప్రాయపడ్డారు. సుదీర్ఘకాలం ఉండాల్సి వస్తే పాలస్తీనియన్ల ఆధ్వర్యంలో గాజాలో పాలన నడపాలని సూచించారు. అతివాత శక్తులు పాలస్తీనా ప్రజలకు ప్రాతినిధ్యం వహించవని ఆయన అన్నారు. ఇజ్రాయెల్లో త్వరలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ పర్యటిస్తారంటూ వస్తున్న వార్తలను ఆదేశ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి ఖండించారు.
ఇప్పటికే ఉత్తర గాజాను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. తుది గడవు ముగిసింది. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్ దళాలు గాజా ఉత్తర ప్రాంతంలో భూతల యుద్ధం మొదలు పెట్టే అవకాశం ఉంది. గాజాలోని ఉత్తరాది ప్రజలు దక్షిణ ప్రాంతాలకు తరలిపోకుండా హమాస్ తీవ్రవాదులు అడ్డుకుంటోన్న ఫోటోలను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన సంగతి తెలిసిందే.