భారత్ – పాక్ దేశాల మధ్య అహ్మదాబాద్ వేదికగా శనివారం నాడు జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో క్రీడాభిమానులు చేసిన జై శ్రీరామ్ నినాదాలు వివాదానికి దారితీశాయి. పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ డగౌట్‌కు వెళుతుండగా కొందరు జైశ్రీరామ్ అంటూ పెద్దగా నినాదాలు చేసిన వీడియో వైరల్‌గా మారడంతో రాజకీయ రంగు పులుకుముంది.
పాక్ క్రికెటర్‌ను అవహేళన చేసే విధంగా జై శ్రీరామ్ నినాదాలు చేశారంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేసిన వీడియోను మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలకు బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఘాటుగా బదులిచ్చారు. ద్వేషపూరితమైన డెంగ్యూ, మలేరియా దోమ మళ్లీ విషాన్ని వ్యాపింపజోస్తోందని ఆయన దుయ్యబట్టారు. నమాజ్ కోసం మ్యాచ్ ఆగిపోయినప్పుడు మీకు ఇబ్బంది లేదా అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మా రాముడు విశ్వంలోని ప్రతిమూలలో నివసిస్తున్నాడు అందుకే జై శ్రీరామ్ అని చెప్పండంటూ గౌరవ్ భాటియా పిలుపునిచ్చారు. భారత్ పాక్ మ్యాచ్ సందర్భంలో గాజాలో ప్రజలకు సంఘీభావం తెలుపుతూ పాకిస్తాన్ క్రికెటర్ మతాన్ని మైదానంలోకి తెచ్చాడనే విమర్శలు వస్తున్నాయి.
సనాతన ధర్మాన్ని డెంగ్యూ దోమతో పోల్చి దాన్ని సమూలంగా నిర్మూలించాలంటూ గత నెలలో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. తాజాగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు మరోసారి రాజకీయ చర్చకు తెరలేపాయి.