బెజవాడ కనకదుర్గ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి గా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధిపొంది ముక్తా, విద్రుమ, హేమనీల, దవళవర్ణాలతో ప్రకాశించు పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యా వందన దేవత గాయత్రీ దేవి.
ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా త్రిమూర్త్యాంశగా గాయత్రీదేవి వెలుగొందుచున్నది. సమస్త దేవతా మంత్రాలకీ గాయత్రీమంత్రంతో అనుబంధం ఉంది.
గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే ఆయా దేవతలకు అన్నాదులు, ప్రసాదాలు నివేదన చేయబడతాయి. గాయత్రీ అమ్మవారిని దర్శించటం వలన ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీమాతను వేదమాతగా కొలుస్తూ, గాయత్రీమాతను దర్శించడం వలన సకల మంత్ర సిద్ధి తేజస్సు,జ్ఞానము పొందుతారని భక్తుల విశ్వాసం.శ్రీ గాయత్రీ దేవిగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఇవాళ పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు.