తమ దేశంపై పలురూపాల్లో మారణ హోమం సృష్టించి…వేలమంది మృతికి కారకుడైన హమాస్ ఉగ్రవాద సంస్థ కమాండర్ ను మట్టుపెట్టినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రకటించింది. నిన్నరాత్రి జరిపిన వైమానికదాడుల్లో
నుఖ్బా యూనిట్ సదరన్ ఖాన్ యూనిస్ బెటాలియన్ కమాండర్ బిలాల్ అల్ ఖిద్రాను అంతమొందించామని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. షిన్ బెట్ సెక్యూరిటీ ఏజెన్సీ, మిలటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ సంయుక్తంగా ఈ చర్యను చేపట్టింది. గత వారంలో దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతంలోని నిరిమ్, నిర్ ఓజ్ తెగకు చెందిన వందలాది మందిని పొట్టన పెట్టుకోవడంలో బిలాల్ అల్ ఖిద్రా ప్రధాన కారకుడని సైన్యం తెలిపింది. గాజా స్ట్రిప్ లో గతరాత్రి జరిపిన వైమానిక దాడుల్లో కమాండర్ ఖిద్రాతోపాటు పలువుురు హమాస్ ఉగ్రవాదులు, ఇస్లామిక్ ఆత్మాహుతిదాడులకు పాల్పడిన వారు మరణించారని సైన్యం ప్రకటించింది.
దాడుల్లో హమాస్ కమాండ్ సెంటర్లు, మిలటరీ కాంపౌండ్లు, డజన్ల కొద్దీ రాకెట్ లాంఛర్లు , ఆపరేషన్ పరిశీలనా కేంద్రాలతో పాటు ఇస్లామిక్ జీహాదీ కేంద్రాలను నేలమట్టం చేశామని సైనికాధికారులు వెల్లడించారు.
అక్టోబరు 7న ఇజ్రాయెల్ లో నరమేధానికి పాల్పడిన హమాస్ తీవ్రవాదులందరికీ ఇదే గతి పడుతుందని సైన్యం హెచ్చరించింది.
ఇదిలా ఉండగా ఉత్తర గాజాను తక్షణమే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ ఆ ప్రాంతవాసులను
ఈ ఉదయమే ఆదేశించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల్లోగా ఉత్తరగాజాను వీడివెళ్లాలని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఉన్న నేపథ్యంలో ఉత్తర గాజా ప్రజలు తక్షణమే దక్షిణ గాజాలోని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన అంతర్జాతీయ అధికార ప్రతినిధి ఒకరు వీడియో సందేశంలో కోరారు.
ఇప్పటిదాకా అందిన సమాచారం ప్రకారం హమాస్ జరిపిన దాడుల్లో 13 వందలమంది ఇజ్రాయెల్ ప్రజలు
అసువులు బాసారని, మరో 3వేల మంది క్షతగాత్రులయ్యారని సైన్యం తెలిపింది. 120 మంది పౌరులు హమాస్ చెరలో ఉన్నారని ధ్రువీకరించింది.