హ్యాట్రిక్
విజయమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి(BRS) ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది.
తీవ్రమేధోమధనం అనంతరం విడుదలైన ఆ పార్టీ మేనిఫెస్టోతో తెలంగాణ రాజకీయాలు మరింత
రంజుగా మారాయి. రాష్ట్రంలోని అన్ని సమూహాలను ఆకర్షించేలా గులాబీ బాస్ తమ
మేనిఫెస్టోను రూపొందించారు.
తెల్ల రేషన్
కార్డు ఉన్న ప్రతీలబ్ధిదారుడికి సన్నబియ్యం అందజేస్తామని చెప్పిన కేసీఆర్, ఈ
పథకానికి తెలంగాణ అన్నపూర్ణ అని నామకరణం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే
ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఇక ఆసరా
పింఛను రూ. 5 వేలు అందజేస్తామని ఎన్నికల వాగ్దానం చేశారు. ప్రతీ ఏడాది రూ.500
పెంచి ఐదో ఏడాది నాటికి రూ. 5 వేలు అందజేస్తామన్నారు.
దివ్యాంగులకు అందజేసే పింఛను
రూ. 6 వేలకు పెంచుతామని చెప్పారు. మార్చి తర్వాత 5వేలకు పెంచి ఆ తర్వాత ప్రతీ
ఏడాది రూ.300 పెంచుతూ ఆరు వేలకు తీసుకెళ్తామన్నారు. సౌభాగ్యలక్ష్మీ పథకం పేరిటి
పేద మహిళలకు రూ.3 వేల గౌరవ భృతి అందజేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
అర్హులైన పేద
మహిళలకు రూ.400కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామన్నారు. అలాగే అక్రిడేషన్ ఉన్న
జర్నలిస్టులకు కూడా రూ.400కే ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.
రైతు బంధు ఎకరాకు రూ.16
వేలకు పెంచుతామన్నారు. మొదటి ఏడాది రూ.12 వేలకు పెంచి ఆతర్వాత దశల వారీగా పెంపు
ఉంటుందన్నారు. ఆరోగ్య శ్రీ పరిధిని రూ. 15
లక్షలకు పెంచడంతో పాటు జర్నలిస్టులకు కూడా రూ. 15 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు
అందిస్తామన్నారు. దీనికి కేసీఆర్ ఆరోగ్య రక్ష
అని పేరు పెట్టారు.
హైదరాబాద్ లో
మరో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మస్తామని, ఇండ్ల స్థలాలు లేని వారికి ప్రభుత్వమే
జాగాలు సమకూరుస్తుందన్నారు.
మేనిఫెస్టో
రిలీజ్ కు ముందు బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థులకు బీఫారాలు అందించారు.తొలివిడతలో
భాగంగా 51 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ-ఫారాలతో పాటు ఒక్కో అభ్యర్థికి రూ. 40
లక్షల చెక్కును అందజేశారు.
ఉమ్మడి మెదక్,
మహబూబ్ నగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థులకు
బీ-ఫారాలు అందజేయగా మిగతా వారికి రేపు ఇస్తామన్నారు
కేసీఆర్
తరఫున గంప గోవర్ధన్, మంత్రి ప్రశాంత్ రెడ్డి తరఫున ఎమ్మెల్సీ కవిత బీ-ఫారమ్
అందుకున్నారు.