ఇజ్రాయెల్ హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. గాజాలో ప్రజలు దక్షిణ ప్రాంతాలకు తరలిపోవాలని ఇజ్రాయెల్ ఇప్పటికే హెచ్చరించింది. గాజాలోని ఉత్తరప్రాంతంలో హమాస్ తీవ్రవాదులను మట్టుబెట్టేందుకు ఈ హెచ్చరికలు జారీ చేశారు. గాజా ఉత్తర ప్రాంతాన్ని త్వరగా ఖాళీ చేయాలని, ఆలస్యం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, తాము భూతల దాడులకు సిద్దమవుతున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. వేలాదిగా దక్షిణ గాజాకు తరలుతోన్న ప్రజలను హమాస్ తీవ్రవాదులు అడ్డుకుంటున్న ఫోటోలను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది.
ఇజ్రాయెల్ త్వరలో ఉత్తర గాజాలో భూదాడులకు దిగబోతోందని ఆ దేశ సైన్యం ప్రకటించింది.ఇప్పటి వరకు ఇజ్రాయెల్ వైమానిక దాడులకే పరిమితం అయింది. కొద్ది గంటల్లో భూతలం నుంచి దాడులు మొదలవుతాయని ఇజ్రాయెల్ హెచ్చరించింది. గాజా ఉత్తర ప్రాంత ప్రజలను హమాస్ తీవ్రవాదులు కవచంగా అడ్డుపెట్టుకుంటున్నారని, వారు దక్షిణ ప్రాంతాలకు తరలకుండా అడ్డుకుంటున్నారని ఐడీఎఫ్ ప్రకటించింది.
అమెరికాపై 9/11 ఉగ్రదాడుల కన్నా తమపై పెద్ద దాడి జరిగిందని ఇజ్రాయెల్ ప్రధాని ప్రకటించారు. హమాస్ ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడుల్లో 1300 మంది అమాయక ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. ఇజ్రాయెల్ జరిపిన ప్రతిదాడుల్లో ఇప్పటి వరకు 2200 మంది చనిపోయారు.