విదేశీగడ్డపై తొలిసారి అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని అమెరికాలోని మేరీలాండ్‌లో ఆవిష్కరించారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 13 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 19 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని మేరీలాండ్‌లోని ఎకోకీక్ నగరంలో ప్రారంభించారు. ఈ విగ్రహం సమానత్వానికి, మానవ హక్కులకు చిహ్నంగా నిలుస్తుందని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ వెల్లడించింది. గుజరాత్లో ఏర్పాటు చేసిన సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహాన్ని తయారు చేసిన ప్రముఖ శిల్పి రామ్ సుతర్ ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని కూడా రూపొందించారు.
వివిధ దేశాలకు చెందిన 500 మంది ప్రముఖులు అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. 13 ఎకరాల ప్రాంగణంలో కన్వెన్షన్ సెంటర్, గ్రంథాలయం, బుద్ద గార్డెన్‌ను ఏర్పాటు చేసినట్లు అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ (AIC) ప్రకటించింది. భారత్ నుంచి దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు నర్రా రవికుమార్ విగ్రహ ఆవిష్కరణకు హాజరయ్యారు. ప్రతిపౌరుడు స్వావలంబన సాధిస్తేనే దేశం సుసంపన్నం అవుతుందని రవికుమార్ అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ ప్రతిపాధించిన ఆర్థిక విధానం ఇప్పుడు కార్యరూపం దాల్చుతోందన్నారు.