రాజమహేంద్రవరం
జైలు అధికారులకు విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్కిల్ కేసులో జుడీషియల్
రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చర్మ సంబంధిత అనారోగ్యంతో
బాధపడుతుండటంపై స్పందించిన న్యాయమూర్తి, వైద్యుల సిఫారసు మేరకు చంద్రబాబుకు చల్లని
వాతావరణం కల్పించాలని ఆదేశించారు.
డీహైడ్రేషన్, స్కిన్ అలర్జీతో బాధపడుతున్నందున తక్షణమే
టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని న్యాయాధికారి ఆదేశించారు. వైద్యుల సూచనలకు అనుగుణంగా
బ్యారక్‌లో చల్లదనం పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కోర్టు రిమాండ్ లో ఉన్న చంద్రబాబు, రెండు వారాలుగా
డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారని, చర్మసంబంధిత సమస్యలు కూడా వచ్చాయని ఏసీబీ
కోర్టులో న్యాయవాది సిద్ధార్థ లూధ్రా అత్యవసర పిటిషన్ వేశారు.
దీనిపై న్యాయమూర్తి
హిమబిందు ఆన్లైన్ లో విచారించారు.వైద్యుల నివేదిక మేరకు చంద్రబాబుకు చల్లని
వాతావరణం కల్పించాలని పిటిషన్ లో కోరారు. ఈ మేరకు వైద్యుల నివేదికను కోర్టుకు
అందజేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి, జైళ్ళ శాఖ అధికారులతో పాటు సీఐడీ తరఫు
న్యాయవాదుల అభిప్రాయాన్ని అడిగారు. కోర్టు ఆదేశాలు పాటిస్తామని వారు బదులిచ్చారు.
దీంతో చంద్రబాబు బ్యారెక్‌లో టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ
చేసింది.