ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. పార్టీలు పోటీపడి జాబితాలను విడుదల చేస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ 144 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది.మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కమల్ నాధ్ ఛింద్వారా నుంచి పోటీ చేయనున్నారు.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ తాజాగా విడుదల చేసిన జాబితాలో పలువురు ప్రముఖులు ఉన్నారు. మాజీ సీఎం కమల్‌నాధ్, మాజీ విద్యాశాఖ మంత్రి జితు పట్వారీ, జైవార్థన్సింగ్, విజయలక్ష్మి సాధో, లక్ష్మణ్‌సింగ్ పేర్లు తొలి జాబితాలో ప్రకటించారు.మధ్యప్రదేశ్‌లో నవంబరు 17న ఎన్నికలు, డిసెంబరు 3న ఫలితాలు ప్రకటించనున్నారు. మాజీ సీఎం దిగ్విజయ్‌సింగ్ కుమారుడు జైవర్ధన్‌సింగ్ రంగీగఢ్ నుంచి పోటీ చేయనున్నారు.
కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఢిల్లీలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. 2021లో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నుంచి జోతిరాదిత్య సింధియా నాయకత్వంలో 22 మంది బీజేపీలో చేరడంతో అక్కడ కమల్‌నాధ్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ చత్తీస్‌గఢ్‌లోని 30 సీట్లకు తెలంగాణలోని 55 సీట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించింది.
మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీ ఇప్పటికే 136 మందితో మొదటి జాబితా ప్రకటించింది. ఎంపీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ బుధినీ నుంచి పోటీ చేయనున్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని చూస్తోంది. ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో పలు ర్యాలీల్లో పాల్గొన్నారు.