తిరుమల శ్రీవారి నవరాత్రి
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఉదయం శ్రీవారు బంగారు తిరుచ్చి వాహనంపై
ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి
భూదేవి సమేత మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి
భక్తులకు అభయప్రదానం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు గ్యాలరీలలో కూర్చుని స్వామి
వారి తిరుచ్చి వాహనసేవను తిలకించారు. నేటి రాత్రి పెద్దశేష వాహనసేవ జరుగనుంది.
రాత్రి 7గంటలకు పెద్ద శేషవాహనసేవను టిటిడి
నిర్వహించనుంది.
శనివారం రాత్రి 7-8 గంటల మధ్యలో
నవరాత్రి బ్రహ్మోత్సవాలకు వైఖానస ఆగమోక్త ప్రకారంగా అంకురార్పణ జరిగింది. రంగనాయకుల
మండపంలోకి స్వామి సేనాధిపతి విష్వక్సేనుడిని ఆహ్వానించి, అర్చకులు ఆస్థానం
నిర్వహించారు. అనంతరం విష్వక్సేనుడు తిరుమాడ వీధుల్లో బ్రహ్మోత్సవ ఏర్పాట్లను
పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓ
ధర్మారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన, ఛాయాచిత్ర
ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అపురూప చిత్రాలతో ఫోటో ఎగ్జిబిషన్‌ను
టిటిడి శనివారం నాడు ప్రారంభించింది. తిరుమలలోని టీటీడీ గార్డెన్స్‌లో రామాయణ భారత
భాగవతాలు, పురాణేతిహాసాలలోని ఘట్టాల ప్రదర్శన ప్రేక్షకులను చూరగొంటోంది.