గ్రూప్- 2 అభ్యర్థిని మర్రి ప్రవళిక ఆత్మహత్య తెలంగాణలో సంచలనంగా మారింది. వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన ప్రవళిక హైదరాబాద్ హాస్టల్లో ఉంటూ
గ్రూప్- 2 పరీక్షలకు సిద్దమవుతోంది. శుక్రవారం సాయంత్రం హాస్టల్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా హాస్టల్‌కు చేరుకున్న విద్యార్థినులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని శుక్రవారం అర్థరాత్రి పోస్టుమార్టమ్ నివేదిక కోసం ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని ఇవాళ ఉదయం ఆమె స్వగ్రామానికి తరలించారు.
ప్రవళికది ఆత్మహత్య కాదని హత్య అంటూ కొన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆరోపణలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రవళికది ఆత్మహత్య కాదని, ప్రభుత్వం హత్య అని దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
ప్రవళిక ఆత్మహత్యపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా స్పందించారు. ప్రవళిక మృతిపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిరుద్యోగ యువత నిరాశకులోను కావద్దని, ఉపాధి వేటలో ధైర్యంగా ముందుకెళ్లాలని గవర్నర్ యువతకు పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువతకు తన పూర్తి మద్దతు ఉంటుందని తమిళసై భరోసా ఇచ్చారు.
గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్య వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆమె ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు.ఆమె ఆత్మహత్య వ్యవహారం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్నట్లు హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు చెప్పారు. ఆమె గదిలో సూసైడ్ నోట్ దొరికిందన్నారు. శివరామ్ రాథోడ్ అనే వ్యక్తితో ఆమె చేసిన చాటింగ్ గుర్తించినట్లు చెప్పారు. శివరామ్ మరో యువతిని పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పడంతో ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు వెల్లడించారు.