లెబనాన్ దక్షిణభాగంలో ఇజ్రాయెల్
సరిహద్దు దగ్గర జరుగుతున్న దాడుల్లో రాయిటర్స్ వార్తాసంస్థకు చెందిన వీడియో జర్నలిస్ట్
ప్రాణాలు కోల్పోయాడు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన నిన్న, అంటే శుక్రవారం నాడు జరిగింది.
రాయిటర్స్ బృందంతో పాటు అల్ జజీరా,
ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్‌కు చెందిన జర్నలిస్టులు ఇజ్రాయెల్ సరిహద్దుకు చేరువలో
ఉన్న అల్మా అల్ షాబ్ ప్రాంతంలో ఉన్నారు. అక్కడ లెబనాన్‌కు చెందిన హెజ్బుల్లా
మిలిటెంట్లకూ, ఇజ్రాయెల్ సైన్యానికీ మధ్య ఘర్షణలు, పరస్పరం కాల్పులూ
జరుగుతున్నాయి.
లెబనాన్ ప్రధానమంత్రి నజీబ్ మికాటీ,
హెజ్బుల్లా ప్రతినిధి ఈ ఘటనకు ఇజ్రాయెల్‌దే బాధ్యత అని నిందించారు. ఇజ్రాయెల్
రక్షణ దళాలు ఈ ఘటనపై వెంటనే స్పందించలేదు. ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్ రాయబారి
గిలాడ్ ఎర్డాన్ మాట్లాడుతూ ‘‘తమ విధినిర్వహణలో ఉన్న జర్నలిస్టును లక్ష్యం చేసుకోవాలని,
లేదా చంపాలనీ మా దేశం ఎప్పుడూ కోరుకోదు. కానీ, యుద్ధం జరుగుతున్నప్పుడు
కొన్నికొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి’’ అని వ్యాఖ్యానించారు. ఆ ఘటనపై తమ
దేశం దర్యాప్తు చేస్తుందని వెల్లడించారు.
రాయిటర్స్ లైవ్ సిగ్నల్ ప్రసారం
చేస్తున్న క్రమంలో వీడియో జర్నలిస్ట్ ఇసామ్ అబ్దల్లా ప్రాణాలు కోల్పోయాడని ఆ సంస్థ
ఒక ప్రకటనలో వెల్లడించింది. కెమెరా ఒక కొండవైపు చూపిస్తుండగా, అక్కడ భారీ పేలుడు
చోటు చేసుకుంది. ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. అరుపులూ కేకలూ వినబడ్డాయి. ‘‘ఆ
ఘటనపై మరింత సమాచారం కోసం ప్రయత్నిస్తున్నాం. స్థానిక అధికారులను
సంప్రదిస్తున్నాం. ఇసామ్ కుటుంబానికి, అతని సహచరులకు మేం అండగా ఉన్నాం’’ అని
రాయిటర్స్ ప్రకటించింది.
ఆ ఘటనలో మరో ఇద్దరు రాయిటర్స్ ప్రతినిధులు
తాహెర్ అల్ సూడానీ, మాహెర్ నాజే గాయపడ్డారు. చికిత్స అనంతరం వారు ఆస్పత్రి నుంచి
డిస్చార్జ్ అయ్యారు. ఆ ఘటన గురించి నాజే ఇలా వివరించాడు, ‘‘మాతోపాటు
మరో రెండు వార్తా సంస్థల ప్రతినిధులు, ఇజ్రాయెల్ వైపు నుంచి దూసుకొస్తున్న
క్షిపణిని చిత్రీకరిస్తున్నారు. అబ్దల్లా అందరికీ కొంచెం ఎడంగా ఒక చిన్నరాతిగోడ
మీద కూచున్నాడు. ముందు ఒక మిసైల్ అబ్దల్లాను తాకింది. మరికొన్ని సెకండ్లలో మరో
మిసైల్ మా బృందం వాడుతున్న కారును ఢీకొట్టింది. కారు క్షణాల్లో మండిపోయింది.’’
అల్ జజీరా, అసోసియేటెడ్ ప్రెస్ తదితర
వార్తాసంస్థలు ఆ మిసైల్ షెల్స్ ఇజ్రాయెల్‌కు చెందినవేనని చెబుతున్నారు. అయితే
రాయిటర్స్ మాత్రం, ఆ క్షిపణులు ఇజ్రాయెల్ నుంచి వచ్చాయన్న సంగతిని
ధ్రువీకరించలేకపోయింది.
ఈ ఘటనలో ఇద్దరు ఎఎఫ్‌పి జర్నలిస్టులు,
ఇద్దరు అల్ జజీరా జర్నలిస్టులు గాయపడినట్లు ఆయా సంస్థలు వెల్లడించాయి. ‘‘అంతర్జాతీయ మీడియాకు నిర్దేశించిన
స్థలంలోనే, మిగతా మీడియా వాహనాలతో పాటే మా బృందం వాహనాన్నినిలిపాము. అయినప్పటికీ
ఇజ్రాయెల్ దాడిలో మా బ్రాడ్‌కాస్ట్ వెహికిల్ పూర్తిగా తగులబడిపోయింది’’ అని అల్
జజీరా వెల్లడించింది. ఆ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఇజ్రాయెల్ సరిహద్దులకు చేరువగా ఉన్న
లెబనీస్ గ్రామం అల్మా అల్ షాబ్… గత వారం రోజులుగా ఘర్షణలకు నెలవుగా మారింది. పాలస్తీనా
మిలిటెంట్ సంస్థ హమాస్‌కు అనుకూలంగా వ్యవహరించే లెబనాన్ ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా
దళాలకు, ఇజ్రాయెల్ సైనిక బలగాలకూ మధ్య జరుగుతున్న పోరుకు ఆ సరిహద్దు గ్రామం
కేంద్రస్థానంగా ఉంది.
మరణానికి కొద్దిసేపటి ముందు అబ్దల్లా సోషల్
మీడియాలో తన ఫొటో పోస్ట్ చేసాడు. అందులో అతను ‘ప్రెస్’ అని రాసివున్న ఫ్లాక్
జాకెట్, హెల్మెట్ ధరించి ఉన్నాడు. అదే విషయాన్ని చెబుతూ అబ్దల్లా తల్లి
‘‘ఇజ్రాయెల్ కావాలనే నా కొడుకును చంపేసింది. వాళ్ళందరూ జర్నలిస్టుల దుస్తులు
ధరించి ఉన్నారు. వాటిపై ‘ప్రెస్’ అని స్పష్టంగా కనిపించేలా రాసి ఉంది’’ అని ఆమె
వాపోయింది.