హమాస్ మిలిటెంట్లను ఏరివేసేందుకు ఇజ్రాయెల్ గాజాపై భీకరదాడులు ప్రారంభించింది. వారం కిందట హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్‌పై మెరుపుదాడులకు దిగడంతో యుద్ధం మొదలైంది. వారం రోజులుగా గాజాపై ఇజ్రాయెల్ జరిపిన ఎదురు దాడుల్లో 1300 భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని, 1900 గాజా పౌరులు చనిపోయారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో 3750 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపింది. 55 వేల గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని ఐరాస ప్రకటించింది.
గురువారం నాటికి గాజాలో 4.23 లక్షల మంది ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లారని తెలిపింది. గాజా ఉత్తర ప్రాంతంలోని 11 లక్షల మంది ప్రజలు ఖాళీ చేసి దక్షిణంవైపు వెళ్లాలని ఇప్పటికే ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇప్పటికే వేలాది మంది ఇళ్లు ఖాళీ చేసి గాజా దక్షిణం వైపు వెళ్లారని తెలుస్తోంది. గాజా ఉత్తరంవైపు నుంచి ప్రజలు వాహనాల్లో దక్షిణం వైపు వెళ్లే క్రమంలో జరిగిన ప్రమాదాల్లో 40 మంది చనిపోయారని, 150 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
వాహనాలు లేని వారు వేలాది మంది కాలినడకన గాజా దక్షిణ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. వారికి సరైన కారిడార్లు లేవని ఐరాస తెలిపింది. అక్కడ తాగడానికి మంచినీరు లేక బావుల్లోని ఉప్పునీరు తాగుతున్నారని, ఇది వ్యాధులకు దారితీయవచ్చని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.
ఇజ్రాయెల్ వైమానిక దాడులతో 11 లక్షల మందికి తాగునీటిని అందిస్తోన్న ఆరు నీటి బావులు, మూడు పంపింగ్ స్టేషన్లు, ఒక భారీ రిజర్వాయర్, డీశాలినేషన్ ప్లాంట్ దెబ్బతిన్నాయని తెలిపింది. పూర్తిగా విద్యుత్ నిలిచిపోయింది. అక్కడ పారిశుద్ధ్యం పతనం అంచుకు చేరుకోవడం మరింత ఆందోళన కలిగిస్తోందని ఐరాస తెలిపింది.