కేంద్ర
హోంమంత్రి అమిత్ షా, నారా లోకేశ్ భేటీతో చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ హస్తం
లేదనే విషయంపై మరింత స్పష్టత వచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు
పురందరేశ్వరి అన్నారు. భేటీ సందర్బంగా చంద్రబాబు ఆరోగ్యంపై అమిత్ షా ఆరా తీశారని, కేసుల వివరాలు లోకేశ్‌ను
అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ప్రజావేగు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు సీఐడీ చెబుతోందన్నారు.
మద్యం తయారీ కంపెనీల యజమానుల పేర్లు బయటపెట్టాలని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మద్యం తయారీ కంపెనీల యజమానులంతా
వైసీపీ నేతలేనని పునరుద్ఘాటించారు. మద్యం తయారు చేసినా అమ్మినా ఏడేళ్ల జైలు శిక్ష
విధించాలని గతంలో సీఎం జగన్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. రాష్ట్రంలో
20 లిక్కర్ తయారీ కేంద్రాలుంటే అవి అన్నీ వైసీపీ నేతల ఆధ్వర్యంలో ఉన్నాయన్నారు.
సాయంత్రంలోపు తయారీదారుల పేర్లు వెల్లడించే దమ్ము, ధైర్యం ఉందా అని సవాల్
విసిరారు.
మద్యం
సేవించడం ద్వారా వచ్చే జబ్బులు గడిచిన రెండేళ్ళలో భారీగా పెరిగాయని వైద్యులు
చెబుతున్నారన్న పురందరేశ్వరి.. నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో రాష్ట్రప్రభుత్వం
చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.