ఫ్రాన్స్‌లో దారుణం చోటుచేసుకుంది. పారిస్ ఈశాన్య నగరం అరాస్‌లోని ఓ పాఠశాలలో చెచెన్యాకు చెందిన ఇస్లామిక్ తీవ్రవాది, ఓ ఉపాధ్యాయుడిని దారుణంగా హత్యచేసి చంపాడు. మరో ముగ్గురిని కూడా తీవ్రంగా గాయపరిచాడు. దీంతో ఫ్రాన్స్ అప్రమత్తమైంది.ఘటనా ప్రదేశంలో 7 వేల మంది సైన్యాన్ని మోహరించినట్లు అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వెల్లడించారు. యూదులు, ముస్లింలు అధికంగా కలిగిన అరాస్ పట్టణంలో ఈ చర్య వెనుక ఇస్లామిక్ ఉగ్రవాదుల హస్తం ఉందని అనుమానిస్తున్నారు. మరో ప్రాంతంలో దాడిని ముందే పసిగట్టిన భద్రతాదళాలు అడ్డుకున్నాయని మక్రాన్ తెలిపారు.
దాడికి తెగబడ్డ వ్యక్తిని అడ్డుకునే క్రమంలో ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయినట్లు పాఠశాలను సందర్శించిన అనంతరం మాక్రాన్ చెప్పారు. ఆ ఉపాధ్యాయుడు ధైర్యంతో చాలా మంది ప్రాణాలు కాపాడారని ఆయన కొనియాడారు. దాడికి తెగబడ్డ 20 ఏళ్ల మహ్మద్ మొగుచ్‌కోవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
దాడి చేసిన వ్యక్తి చెచెన్యాలో ముస్లింలు ఎక్కువగా ఉండే దక్షిణ కాకసస్ ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. ఇప్పటికే ఫ్రెంచ్ జాతీయ రిజిస్టర్‌లో ఇతనిపై
భద్రతా పరంగా అనుమానిత వ్యక్తిగా నమోదై ఉందని పోలీసులు తెలిపారు. ఈ దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.