ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో అక్కడి భారతీయులు స్వదేశం చేరుకుంటున్నారు. భారతీయులను క్షేమంగా తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ అజయ్‌లో భాగంగా రెండవ విమానం 235 మంది ప్రయాణీకులతో ఢిల్లీ చేరుకుంది.ఈరోజు తెల్లవారుజామున ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన ప్రయాణీకులకు విదేశాంగ సహాయ మంత్రి రాజ్‌కుమార్ స్వాగతం పలికారు.
ఇజ్రాయెల్‌లో 18 వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో దాదాపు వెయ్యి మంది విద్యార్థులు కూడా ఉన్నారు. ఆపరేషన్ అజయ్ చేపట్టిన తరవాత మొదటి విడత 212 మందిని శుక్రవారంనాడు భారత్‌కు తరలించారు. రెండో విడత ఇవాళ 235 మందిని తీసుకువచ్చారు. భారత్‌కు తిరిగిరావడానికి సానుకూలంగా ఉన్న వారందరినీ తీసుకువచ్చేందుకు ఆపరేషన్ అజయ్ కొనసాగుతోంది. యుద్ధభూమి నుంచి తమను సురక్షితంగా భారత్ తీసుకురావడంపై ప్రయాణీకులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు.