భారత్ శ్రీలంక మధ్య నూతన అధ్యాయం మొదలైంది. రెండు దేశాల మధ్య పడవ ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. తమిళనాడులోని నాగపట్నం, శ్రీలంకలోని కన్‌కేసంతురాయ్ మధ్య ప్రయాణీకుల కోసం ఫెర్రీ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సేవల ద్వారా భారత్, శ్రీలంక దేశాల ప్రజల మధ్య బంధం మరింత బలపడుతుందని విదేశాంగ మంత్రి జైశంకర్ అభిప్రాయపడ్డారు. ఇవాళ నాగపట్నంలో విదేశాంగ మంత్రి జై శంకర్, జలరవాణా మంత్రి సర్‌బనంద సోనోవాల్ ఫెర్రీ సేవలను ప్రారంభించారు.
రెండు దేశాల ప్రజల మధ్య బంధాలను మరింత బలపరచాలన్న ప్రధాని మోదీ ఆశయాలకు అనుగుణంగా ఈ ఫెర్రీ సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు జైశంకర్ తెలిపారు. నాగపట్నం నుంచి చెరియపలని ఫెర్రీ 50 మంది ప్రయాణీకులతో శ్రీలంక బయలు దేరింది. ఇదే పడవ సాయంత్రం శ్రీలంక నుంచి
నాగపట్నంకు ప్రయాణీకులను చేరవేయనుంది.
నాగపట్నం కన్‌కేసంతురాయ్ మధ్య 110 కి.మీ దూరాన్ని ఫెర్రీలో 3 గంటల 50 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఒకేసారి 150 మందిని తీసుకెళ్లే సామర్ధ్యం ఉన్న పడవలను ఉపయోగిస్తున్నారు. ఇందుకు నాగపట్నం రేవులో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశారు. కన్‌కేసంతురాయ్ రేవులో కూడా కనీస సదుపాయాలు మెరుగు పరిచారు.
భారత్, శ్రీలంక దేశాల మధ్య పడవ ప్రయాణం అందుబాటులోకి రావడంతో ప్రజలకు ప్రయాణ ఖర్చులు భారీగా తగ్గనున్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్యం పెరగడంతోపాటు, పర్యాటకరంగాలకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. రెండు దేశాల మధ్య ఫెర్రీ సేవలు ఇరు దేశాల మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా పెరిగేందుకు దోహదం చేస్తాయి.
భారత్, శ్రీలంక మధ్య ఫెర్రీ సేవల ప్రారంభంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు.ఇది ఒక చారిత్రక ఘట్టంగా ఆయన అభివర్ణించారు. ఫెర్రీ సేవలు ప్రారంభించడం ద్వారా భారత్, శ్రీలంక మధ్య దౌత్య, వాణిజ్యపరంగా నూతన అధ్యాయం ప్రారంభమైందని ప్రధాని అభిప్రాయపడ్డారు.