ఇజ్రాయెల్ హమాస్ తీవ్రవాదుల యుద్ధం నేపథ్యంలో అమెరికా, కతార్ దేశాల మధ్య చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.గాజా ప్రజలకు ఇలాంటి సమయంలో సహాయం అందించడం చాలా క్లిష్టమైన వ్యవహారమని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అభిప్రాయపడ్డారు. గాజా ప్రజలను రక్షణ కవచాలుగా చేసుకుని హమాస్ దాడులు కొనసాగిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్న వేళ అక్కడి ప్రజలకు సాయం అందించడం కత్తి మీద సాములాంటిదని బ్లింకెన్ తెలిపారు.గాజా ప్రజలకు సాయం అందించే దేశాలతో తాము సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. పాలస్తీనా ప్రజలకు కతార్ సాయం అందిస్తోందని తెలిపారు.
ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య చోటు చేసుకున్న యుద్ధంపై కతార్ ప్రధాని, విదేశాంగ మంత్రి మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అలి ధానితో చర్చలు జరిపిన అనంతరం ఆ వివరాలను ఎక్స్‌లో పంచుకున్నారు. మరిన్ని దేశాలకు ఈ యుద్ధం వ్యాపించకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు.
హమాస్ మిలిటెంట్లు 1300 మంది ఇజ్రాయెల్ పౌరులను పొట్టనబెట్టుకున్నారని, వారిలో పసి పిల్లలు, వృద్ధులు, మహిళలు కూడా ఉన్నారని ఆయన గుర్తుచేశారు. ఇజ్రాయెల్ గాజాపై తీవ్రదాడులు జరుపుతున్న వేళ అక్కడి ప్రజలకు సాయం అందించడంపై వివిధ దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు బ్లింకెన్ తెలిపారు.
పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలంటే ఇజ్రాయెల్ పాలస్తీనా కాల్పుల విరమణకు అంగీకరించాలని, బందీలను విడిచిపెట్టాలని కతార్ ప్రధాని షేక్ మహమ్మద్ అభిప్రాయపడ్డారు. యుద్ధం మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా ఉండాలంటే పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పడం చాలా ముఖ్యమని ఆయన తెలిపారు. మానవతాదృక్పథంతో పాలస్తీనా ప్రజలకు తగిన సాయం అందిస్తున్నట్లు కతార్ ప్రధాని చెప్పారు.