స్కిల్
డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ ఈ నెల 17కు వాయిదా
పడింది. ఈ కేసులో చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందని చంద్రబాబు తరపు న్యాయవాది
వాదించగా, ఆ సెక్షన్ వర్తించదని సీఐడీ తరఫు న్యాయవాది వాదించారు. ఇరువర్గాల వాదనలు
విన్న జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం తదుపరి విచారణను
ఈ నెల 17కు వాయిదా వేసింది.
మరో కేసులో చంద్రబాబును 16న ప్రవేశపెట్టేందుకు వారెంట్
తీసుకున్నారని కోర్టుకు తెలిపారు. కేసులపై కేసులు పెట్టి తమను సర్కస్ ఆడిస్తున్నారన్నారు.
ఇక్కడ కూడా 17 ఏను ఛాలెంజ్ చేస్తున్నారా..? అని లూధ్రాను జస్టిస్ త్రివేది ప్రశ్నించగా,
అవును ప్రతి చోటా సెక్షన్ 17ఏ వర్తిస్తుందన్నారు.
అధికార
విధులు నిర్వర్తించడమంటే అవినీతికి పాల్పడటం కాదు కదా, అధికార విధుల నిర్వహణ
ముసుగులో అవినీతికి పాల్పడకూడదని సీఐడీ తరఫు న్యాయవాది రోహత్గీ వాదించారు.
ఫైబర్నెట్
కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్
విచారణ కూడా మంగళవారానికి వాయిదా పడింది.
ఫైబర్నెట్ కేసులో ముగ్గురికి ముందస్తు
బెయిల్ వచ్చిందని ఇద్దరికి రెగ్యులర్ బెయిల్ వచ్చిందని, మరికొంతమంది ప్రస్తావనే
లేదని చంద్రబాబు తరఫు న్యాయవాది వాదించారు. తన క్లయింట్ చంద్రబాబుకు కూడా బెయిల్
ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు.